

హైదరాబాద్: తెలంగాణలోని వాహనదారులకు ఇది శుభవార్తే. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు లభించబోతోంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. వాహనాల రిజస్ట్రేషన్ ప్రక్రియను ఇక నుంచి డీలర్లకే ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇది అమలు కానుంది. ఈ విధానం వల్ల ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదాలకు విముక్తి లభించనుంది. అలాగే, రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పనుంది. ఫలితంగా ఏజెంట్ల మోసాలకు చెక్ పడుతుంది.
తొలుత బైకులు, కార్లకు ఈ రూల్ తెస్తున్నారు. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆయా షోరూంలలోనే చేపట్టనున్నారు. హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను కూడా డీలర్లే బిగించాల్సి ఉంటుంది. అలాగని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే అవసరం కూడా లేదు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమాలను విధిస్తారు. లేదంటే డీలర్‌షిప్‌ను రద్దు చేస్తారు.
ఇక నంబరు ప్లేటు లేని వాహనం కనిపించదు
ఈ సరికొత్త విధానం వల్ల ఏప్రిల్ నుంచి నంబరు ప్లేటు లేని వాహనం రోడ్డుపై కనిపించే వీలుండదు. ఒకవేళ అలా చేస్తే ఫైన్ తప్పదు. అయితే ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే మాత్రం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లడం తప్పనిసరి. అయితే, ఈ కొత్త విధానం అమలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది.
ప్రత్యేక సాఫ్ట్వేర్ కోసం ఏకంగా రూ. 11 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఏప్రిల్ నాటికి అన్ని సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.








