హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, ప్రజా కూటమిలు ఎంతో జోరుగా తమ ప్రచారం సాగించాయి. అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నందమూరి సుహాసిని ప్రచార పర్వం గురించి తెలిసిందే.
సుహాసిని కోసం నందమూరి బాలకృష్ణ, తారకరత్న, నందమూరి జానకిరామ్ భార్య, ఇలా ఆమె కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్ షోలలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.
‘‘ఎన్టీఆర్‌ను నేనే రావద్దన్నా…’’
ప్రచారంలో భాగంగా బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ తనకు కూడా కొడుకే అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. సుహాసిని కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రచారంలో పాల్గొనలేదు. అయితే దానికి కారణం తానేనంటూ బాలయ్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
”సుహాసిని కోసం ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ఎదుగుతూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ప్రచారంలో పాల్గొంటే కొంతమంది నుంచి అతనికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్‌కి ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు. ఆ భయంతోనే నేను తారక్‌ని ప్రచారానికి రావొద్దని అన్నాను..’’ అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ‘‘తారక్ నా అన్న కొడుకు మాత్రమే కాదు.. నాకు కూడా కొడుకే. అందుకే నేను ప్రచారానికి రానివ్వలేదు. నా కొడుకు మోక్షజ్ఞ ఎందుకు ప్రచారానికి రాలేదో.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే ప్రచారనికి రాలేదు..” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు వివరించారు నందమూరి బాలకృష్ణ.