విశాఖపట్నం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవస్వామి ఆలయం వద్ద తాంత్రిక పూజలు ఆగడం లేదు. అమావాస్య రోజుల్లో అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఈ క్షద్ర పూజలు జరుగుతున్నాయి.
అసలు ఈ పూజలు బయటి వ్యక్తులు చేస్తున్నారా?.. లేక ఆలయ అధికారులే ఆ పూజలను ప్రోత్సహిస్తున్నారా?.. అని కూడా పలువురు అనుమానిస్తున్నారు. తాంత్రిక పూజలపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే ఈ అనుమానాలకు కారణమవుతోంది.
వివరాల్లోకి వెళితే.. సింహాచలం ఆలయ పరిధిలోని భైరవకోనలోని భైరవస్వామి ఆలయంలో గురువారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు పూజలు, హోమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
సూత్రధారి ఆయనేనా?
ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి సింహాచలం దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కె. రామచంద్ర మోహన్‌గా పేర్కొంటున్నారు. ఆయన తన బంధువుల కోసం ఆలయంలో హోమాలు, పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ఆలయ ఈవో ఆదేశాలపై సింహాచలానికి చెందిన ఐదుగురు పండితులు భైరవస్వామి ఆలయానికి వచ్చి తాంత్రిక పూజలు జరిపినట్లు తెలుస్తోంది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులను లోపలికి రానీయకుండా.. బయటనే ఉంచి తాళాలు వేసి మరీ ఈ పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.
సాధారణంగా అమావాస్య వేళల్లో భైరవస్వామిని దర్శించుకోవడానిక భక్తులు అధిక సంఖ్యలో ఆలయనికి తరలివస్తుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోనివ్వకుండా అధికారులే ఇలా చేయడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భక్తులను లోపలికి రాకుండా అడ్డుకున్న సమయంలో కొంతసేపు తోపులాట, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు.. అధికారులను నిలదీసిన భక్తులపై ఆలయ సిబ్బంది దౌర్జన్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.