ఆగస్టు నాటికి ఎల్బీనగర్-అమీర్‌పేట మధ్య తిరగాడనున్న‘మెట్రో’

metro-rail
- Advertisement -

driveg-mobikes

హైదరాబాద్: ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రోరైలు ప్రయాణాన్ని ఆగస్టులో అందుబాటులోకి తెస్తామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పనులన్నీ చివరిదశకు చేరినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్‌లో డ్రైవ్‌జీ రెంటల్ బైక్‌లను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మెట్రోరైలుతో హైదరాబాద్ నగర రూపురేఖల్లో సమూల మార్పులు వస్తున్నాయని చెప్పారు.

ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు నగర అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామన్నారు. అప్పట్లో మెట్రో ప్రాజెక్టును అసాధ్యమన్నవారే ఇప్పుడు చూసేందుకు వస్తున్నారని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.  మాల్స్‌లో ఎక్కువగా గడిపేంత సమయం నగరవాసులకు లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణిస్తూనే నిత్యావసరాలు అందేలా ప్రాజెక్టును రూపొందించినట్లు పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు కితాబు…

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను ఎన్వీఎస్ రెడ్డి ప్రశంసించారు.   సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ప్రపంచంలోని పెద్ద కంపెనీలన్నీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని,  ఎంతో అనుభం ఉన్నవారికి కూడా మంత్రి కేటీఆర్ మాదిరిగా మార్కెటింగ్ ప్రతిభ లేదని వ్యాఖ్యానించారు.

పర్యాటక ప్రాంతంగా…

ప్రయాణికుల సౌలభ్యం కోసం లాస్ట్‌మైల్ కనెక్టివిటీతోపాటు ఫస్ట్‌మైల్ కనెక్టివిటీపైనా దృష్టిసారించినట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ప్రారంభించిన బైకులు, కార్లు, రెంటల్ మొబైక్స్ విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. కారిడార్-1లోని 5 కిలోమీటర్ల మార్గానికి సమీపంలో ఉన్న చారిత్రక కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏడాదిలోగా సర్వాంగ సుందరంగా మార్చి మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.

పార్కింగ్ సమస్యకు పరిష్కారం…

ఎంజీబీఎస్ వద్ద రెండు స్కైవాక్‌లు సిద్ధమయ్యాయని, నగరంలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాజెక్టులోని ప్రకాశ్‌నగర్ స్టేషన్ మినహా అన్ని స్టేషన్లలో సరిపడా పార్కింగ్ స్థలం ఉందని, స్మార్ట్‌పార్కింగ్ సాఫ్ట్‌వేర్ సిద్ధమవుతున్నదని, త్వరలో 24 స్టేషన్లలో ఏర్పాటు చేస్తామన్నారు. మల్టీలెవెల్ కార్‌పార్కింగ్ పనులకు త్వరలో శ్రీకారం చుడుతామన్నారు.

అందుబాటులోకి 125 బైక్‌లు…

డ్రైవ్‌జీ సంస్థ లాస్ట్, ఫస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగస్వామి అవుతోందని, తొలుత 125 బైక్‌లు అందుబాటులోకి రానున్నాయని, బాలానగర్, కూకట్‌పల్లి, తార్నాక, ప్రకాశ్‌నగర్, మెట్టుగూడ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.  ఎల్‌అండ్‌టీ మెట్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏకే షైనీ మాట్లాడుతూ నగరంలోని బసు, రైలు, ఎంఎంటీఎస్‌తో మెట్రోరైలును అనుసంధానం చేస్తున్నామన్నారు.

యాప్, వెబ్‌సైట్ ద్వారా బుకింగ్…

డ్రైవ్‌జీ ప్రతినిధి అభిషేక్ మాట్లాడుతూ డ్రైవ్‌జీ యాప్, వెబ్‌సైట్ ద్వారా బైక్ ను బుక్‌చేసుకోవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్సుతోపాటు ఆధార్ లేదా పాన్‌కార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. కిలోమీటర్‌కు రూ.3 చార్జీ వసూలు చేస్తున్నట్టు చెప్పారు. రూ.2,700 చెల్లిస్తే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఇస్తామని, వారం, 15 రోజుల ప్యాకేజీలు కూడా ఉన్నాయన్నారు.

- Advertisement -