హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ, హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్ నేతల కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తమ హైకమాండ్‌తో కొట్లాడి తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని… అమ్మా కాదు, బొమ్మా కాదు అని అంటావా? అంటూ కేటీఆర్‌పై అంజన్ మండిపడ్డారు.
మీ తండ్రి కేసీఆర్ కేవలం అబద్ధాలతోనే గద్దెనెక్కారని విమర్శించారు, సోనియాగాంధీ కాళ్లు కడిగి, నెత్తిన చల్లుకుంటే పుణ్యమైనా వస్తుందని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. కేటీఆర్ నోటి దురుసును తగ్గించుకోవాలని అన్నారు. గత నాలుగేళ్లలో కేటీఆర్ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పై ఏ మాత్రం గౌరవం ఉన్నా… రాష్ట్రం కోసం పోరాడిన ఎంపీలపై పోటీ పెట్టకూడదని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని అంజన్ దుయ్యబట్టారు.