హైదరాబాద్: మహాకూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ… కూటమిలోని మిగిలిన పార్టీలతో సీట్ల విషయంలో ఎలాంటి తగవు పడడం లేదు. అదే సమయంలో తనకు బాగా పట్టున్న ప్రాంతాలనే ఎంచుకుని.. అక్కడి నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తొలి విడత జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను టీ-టీడీపీ ప్రకటించింది.. అయితే ఈ పార్టీ కూడా తొలుత గ్రేటర్ పరిధిలోని కీలక నియోజకవర్గాలను కొంత సస్పెన్స్‌లో పెట్టింది. హైదరాబాద్‌లో మొదటినుంచీ తెలుగుదేశానికి బాగా పట్టున్న కూకట్‌పల్లి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ స్థానం కోసం టీ-టీడీపీలోని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోని ఒకరిని కూకట్‌పల్లి బరి నుంచి ఈ ఎన్నికల్లో దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
హరికృష్ణ కుటుంబంలో ఒకరికి…
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలోని ఒకరికి ఈ సీటును కేటాయించే అవకాశం కనిపిస్తోందని పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంతేకాదు, టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ కుమార్తె సుహాసిని ఖరారైనట్లుగా పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసిని. ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భావిస్తోన్న చంద్రబాబు.. హరికృష్ణ తనయుడు, సినీనటుడు కల్యాణ్‌రామ్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అయితే తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని.. ప్రస్తుతం రాజకీయాల మీద ఆసక్తి లేదని ఆయన అన్నట్లుగా టాక్ నడుస్తోంది.
దీంతో కూకట్‌పల్లి స్థానానికి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన వెలువడే వరకు వేచిచూడాల్సిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఈ వార్త విని సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రచారం ఆపివేయాలని పెద్దిరెడ్డికి అదేశం…?
కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని తానేనంటూ నెల రోజులుగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి టీడీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వెంటనే ప్రచారాన్ని ఆపివేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించకుండా.. ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, కాబట్టి, వెంటనే ప్రచారం ఆపాలని ఆయనకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.