
విజయవాడ: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో అసలు దోషులను శిక్షించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనుక కింది కోర్టులోని న్యాయాధికారులతో సహా మరే ఇతర అధికారుల హస్తం ఉన్నా ఎవర్నీ వదలిపెట్టబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు, హత్య కేసు ‘అప్పీల్’ పైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు నాశనం చేయడం ఏమిటంటూ హైకోర్టు మండిపడింది. ఈ విషయమై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విచారణ జరిపించి, సమర్పించిన నివేదికను లోతుగా పరిశీలించేందుకు కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
పదకొండేళ్ల క్రితం…
విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో 2007 డిసెంబరులో జరిగిన ఆయేషామీరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు దోషులను గుర్తించి శిక్షించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
దర్యాప్తు ఎలా చేపట్టాలో సీబీఐకి తెలుసు…
సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా.. సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ తన వాదనలు వినిపించారు. ఆయేషా కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించే యోచనలో ఉన్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.
అయితే వస్తు సంబంధ సాక్ష్యాలు అందుబాటులోలేని కారణంగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించడం కష్టంగా ఉంటుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ తెలుపగా, ఆయన వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందిః. ఇలాంటి సందర్భాల్లోనూ దర్యాప్తు ఎలా చేపట్టాలో సీబీఐకి తెలుసునని వ్యాఖ్యానించింది.
శిక్షపడని అన్ని కేసుల్లో బాధ్యులుగా పేర్కొంటూ దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోకపోవడం సరైనదే అయినా, అరుదైన కేసుల్లో అధికారులు శిక్షలు ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.








