గుయానా: టీ20 2018 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. వెస్టిండీస్ దీవులు వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌లోని రెండు గ్రూప్ దశ పోటీల్లో తిరుగులేదనిపించుకున్న భారత మహిళా జట్టు సెమీస్ బెర్త్‌పై కన్నేసింది.
గ్రూప్-బీలో ఉన్న భారత జట్టు పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్ నెగ్గితే భారత జట్టు సెమీఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా… రన్‌రేట్ కాపాడుకుంటే చాలు.. సెమీస్ చేరగలుగుతుంది.
తొలి రెండు మ్యాచ్‌లలో ఘన విజయం….
తొలి మ్యాచ్‌లో భారత క్రికెట్ మహిళల జట్టు న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ సెంచరీతో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో పాటు మిథాలీ రాజ్ మెరుపు హాఫ్ సెంచరీతో సునాయాస విజయం సాధించింది.
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత జట్టు టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత మహిళల జట్టు మూడో రౌండ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తోను, ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియా జట్టుతో పోటీ పడనుంది.
ప్రస్తుత టోర్నీలో హర్మన్ ప్రీత్ సేన జోరు చూస్తుంటే మిగతా రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ గెలుపు ఖాయమనే అనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయిన భారత మహిళల జట్టు ఈసారి ఎలాగైనా విశ్వవిజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.