

హైదరాబాద్: తనపై సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ ఆరోపణలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం వల్లే బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని సయ్యద్ షుజా అనే భారత హ్యాకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గొడవ జరగడంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి తమపై గన్ మెన్లతో కాల్పులు జరిపించారనీ, ఈ ఘటనలో 11 మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నానని తెలిపారు.
స్పందించిన కిషన్ రెడ్డి: డీజీపీకి ఫిర్యాదు…
ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో స్క్రిప్ట్ తయారు చేసుకుని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ లండన్‌లో సయ్యద్ షుజాతో ఆరోపణలు చేయించారని కిషన్ రెడ్డి విమర్శించారు.
సయ్యద్ షుజా ఎవరో.. అతని ముఖం ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు. ఇంతటి దివాలాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. తాను 11 మందిని చంపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ఆ వ్యక్తుల గురించి మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టలేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
2014, మే 13న ఈ ఘటన జరిగిందని సయ్యద్ షుజా అనే హ్యాకర్ చెప్పాడు, మరి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఈవీఎంల హ్యాకింగ్ వ్యవహారంలో 11 మందిని ఎలా చంపించగలనని నిలదీశారు. ఈ వ్యవహారంలో అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.








