హైదరాబాద్: గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ పార్టీ దళపతి, సీఎం కేసీఆర్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన వంటేరు ప్రతాప రెడ్డిపై ఆయన 51,515 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,366 ఓట్లతో వంటేరుపై గెలిచిన కేసీఆర్.. ఈసారి భారీ మెజార్టీ దక్కించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సిద్దిపేట, కరీంనగర్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. 2014లో తొలిసారిగా గజ్వేల్ బరిలో నిలిచారు. ఉద్యమ నేతగా ప్రజలు మన్ననలను అందుకున్న కేసీఆర్.. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆదినుంచీ ధీమాగానే ఉన్నారు.
ఆ ఆత్మవిశ్వాసంతోనే ప్రచారంలో చివరి రోజు తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. అందరూ ఊహించినట్టే ఆయన కిందటిసారి కంటే అధిక మెజారిటీ ఓట్లతో ఎన్నికల్లో విజయం సాధించారు.
1983, 1985, 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక), 2004 సంవత్సరాల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యే గెలుపొందారు. అనంతరం కరీంనగర్ ఎంపీగా పోటీచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేశారు.
2014లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ తరువాత ఫలితాల అనంతరం కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు.