యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం.. ఇక కేసీఆర్, కారు గుర్తులు లేనట్టే!

12:29 pm, Sun, 8 September 19

హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శిల్పాల వ్యవహారంపై కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భారీ ఎత్తున శిల్పాలను చెక్కుతున్నారు.

అయితే, ఆలయం బయట ఏర్పాటు చేసిన అష్టభుజి బాహ్య ప్రాకారంలో కేసీఆర్, కేసీఆర్ కిట్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, మరికొన్ని ప్రభుత్వ పథకాల లాంటివి స్తంభాలపై చెక్కించడం వివాదాస్పదమైంది.

ఫొటోలు బయటకు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అయితే, అది శిల్పుల ఇష్టమని యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేవే ఈ శిల్పాలని సూచించింది.

ఈ విషయంలో రాజకీయం తగదని హితవు పలికింది. ఒకవేళ తీవ్ర అభ్యంతరాలు వస్తే వాటిని తీసేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.

అయినా, ఈ వివాదం సద్దుమణగకపోవడంతో.. యాదాద్రి ఆలయంలో దైవ సంబంధిత చిహ్నాలే తప్ప మరే ఇతర చిత్రాలు ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

బాహ్య ప్రాకారంలోని స్తంభాల్లో కేసీఆర్‌తో పాటు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, కమలం పువ్వు, సైకిల్ వంటి కొన్ని రాజకీయ చిహ్నాలు కూడా ఉన్నాయి.

ఆలయాల్లో వాటిని చెక్కడంపై భూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైటీడీఏ స్పెషల్ అధికారి కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, మరికొందరితో ఆయన ప్రగతిభవన్‌లో సమావేశమై చర్చించారు.

ఆలయ ప్రాంగణంలో తన చిత్రం ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకోరని, కేవలం దేవాలయ విశిష్టత, దైవ సంబంధిత అంశాలకు మాత్రమే శిల్పులు పరిమితం కావాలనేది సీఎం ఆకాంక్ష అని వారికి స్పష్టం చేశారు.

తక్షణం నాయకుల చిత్రాలు, పార్టీల చిహ్నాలు తొలగించాలని ఆదేశించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.