ఇస్రో శాస్త్రవేత్తలకు మహేశ్‌బాబు సెల్యూట్.. నిజమైన హీరోలంటూ ప్రశంస

6 days ago

హైదరాబాద్: చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోవడంతో దేశం యావత్తూ నిరాశ, నిస్పృహలకు లోనైన సంగతి తెలిసిందే.

అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ‘మిషన్‌ మూన్‌’ విఫలమైనా, చంద్రయాన్-2 ప్రయోగంలో పాలుపంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ట్విటర్‌ వేదికగా అభినందించాడు.

‘మహర్షి’ చిత్రంలోని ఆయన డైలాగ్‌లను పంచుకుంటూ… ‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఎ డెస్టినేషన్. ఇట్స్‌ ఎ జర్నీ..’ అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. చంద్రయాన్‌-2తో ఇస్రో చరిత్రాత్మక ప్రయాణం మొదలు పెట్టిందని, ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్‌ చేస్తున్నాని పేర్కొన్నాడు.

‘‘మీరే మా నిజమైన హీరోలు. మీతో మేమున్నాం. మన విజయ గాథకు ఇదే ఆరంభం. ఇదే మార్గం.” అని మహేష్‌బాబు ట్వీట్‌ చేశాడు. ‘అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడి శ్రమించిన శాస్త్రవేత్తలకు సెల్యూట్‌’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.