ఇల్లంతకుంట: మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రస్తుత అభ్యర్థి రసమయి బాలకిషన్ తాజగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రసమయి తనను అసభ్యకరంగా దూషించారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ మహిళ.
మానకొండూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా తిరిగి టిక్కెట్ దక్కడంతో తన నియోజకవర్గంలో రసమయి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో రసమయికి స్వాగతాల కంటే నిరసనలే ఎక్కవగా స్వాగతం పలుకుతున్నాయి.
ఒక్కొక్కసారి ప్రజల నుంచి ఊహించని స్థాయిలో విపరితంగా నిరసనలు వస్తుండటంతో రసమయి బాలకిషన్ కొన్ని సందర్భాల్లో తన ప్రచారాన్ని రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు చాలాసార్లు అనేక గ్రామాల ప్రజలు తిరగబడటంతో రసమయి ప్రచారం నిలిపివేసి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఈ క్రమంలో నవంబర్ 4 తేదిన ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు రాకుండా మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో రావడంతో ఆయనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కందికట్కూర్ మహిళలు గతంలో బాలాకిషన్ ఇచ్చిన హామీలపై నిలదీశారు.
దీంతో కోపోద్రిక్తుడై సహనం కోల్పోయిన రసమయి బాలకిషన్ అక్కడి మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని కందికట్కూర్ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకు ఫిర్యాదు చేసింది.
రసమయి బాలకిషన్ మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటమే కాకుండా తన భుజాలపై చేతులు వేసి చెప్పరాని విధంగా దుర్భాషలాడారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా రసమయి బాలకిషన్ దుర్భాషలకు సంబంధించిన వీడియోలు, ఆడియో క్లిప్పింగ్‌లను కూడా తన ఫిర్యాదుకు జాతపరిచారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన రసమయి బాలకిషన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. జ్యోతితోపాటు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కూడా ఎస్పీని కలిశారు.