పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన త్రయోదశి’ లేదా ‘చోటీ దివాళీ’ అని పిలుస్తారు. సామాన్యంగా ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అని పేరు.
మరి ఆ ధనత్రయోదశి మంగళవారమైన ఈరోజే. ఈ రోజు చాలా మంది ప్రత్యేకంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసి, సాయంత్రం దీపాలు వెలిగించి ఇంటిలోకి నడిచివచ్చే లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు తమ ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, లక్ష్మీదేవికి మంగళహారతి ఇస్తారు.
ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలుదీరి, తాము సిరిసంపదలతో తులతూగుతామని ప్రజల నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతుకు తగినట్లు బంగారం, వెండి, విలువైన వస్తువులు లేదా కొత్త బట్టలు కొనుగోలు చేప్తారు. ఈ ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు.
ఈ పర్వదినాన ఏం చేయాలంటే…
బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. నేడు శుచిగా స్నానాదులు ముగించిన తరువాత, నిరుపేదలకు భోజనమో, వస్త్రమో, డబ్బో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతుందీ పండగ. స్వర్ణపుష్పాలు లేనప్పుడు, బంగారలాంటి మనసుతో అర్చించినా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది.
పురాణాల్లో ఉన్న ఓ కథ…
మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి. కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి వెళతాడు. అక్కడ తనను గమనించని లక్ష్మీ, విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై, శ్రీహరి వక్షస్థలాన్ని తంతాడు.
విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ, కాళ్లు పట్టుకుని, ఆపై భృగువుకు అరికాలులో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని, అహంకారాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవడం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది.
ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి (మహారాష్ట్రలోని కొల్హాపూర్) చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి.. లక్ష్మీదేవి కరుణను పొందాడట. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి, అది ‘ధన త్రయోదశి’ అయింది.
మరో కథ ప్రకారం…
హిమ అనే రాజు కుమారుడి జాతకంలో వివాహమైన నాలుగో రోజున ప్రాణగండం ఉంటుంది. రాజ కుమారుడు తన 16వ ఏట మరణిస్తాడని జ్యోతిషులు హిమ రాజుకు తెలియజేస్తారు. కుమారుడి మరణం గురించి చింతిస్తూనే పక్క రాజ్యం రాజకుమారితో అతడికి వివాహం జరిపిస్తాడు హిమ రాజు.
హిమ రాజు తన కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి చెప్పి ఆమెనే తరుణోపాయం ఆలోచించమని చెబుతాడు. పెళ్లైన మూడో రోజు తన భర్తను మృత్యువు నుంచి కాపాడేందుకు ఆమె ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి, రాత్రి అంతా జాగారం చేస్తుంది.
ఆమె దగ్గర ఉన్న విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి, తన కోట ప్రవేశ ద్వారం దగ్గర ఉంచి. దాని చుట్టూ దీపాలు వెలిగించి, భగవంతుని స్మరిస్తూ, తన భర్తతో పాటు ఆమె కూడా నిద్ర పోకుండా రాత్రంతా జాగారం చేస్తుంది.
ఆ మర్నాడు ఉదయం యమ ధర్మరాజు రాజ కుమారుడి ప్రాణలు తీసుకుపోవడానికి ఆ కోటకి వస్తాడు. కానీ రాకుమారి వెలిగిచిన ఆ దీపాల విపరీతమైన కాంతితో ఆయన చూపు మసకబారి, లోపలికి ప్రవేశించలేకపోతాడు.
ఎంత ప్రయత్నించినా యమధర్మరాజు అ దీపాలు, బంగారు పెట్టెని దాటుకుని లోపలికి వెళ్ళలేక పోతాడు. చివరికి రాకుమారుడిని ఏం చేయలేక.. యముడు అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా ఆ రాజకుమారి లక్ష్మీకటాక్షంతో తన భర్త ప్రాణాలు దక్కించుకుంటుంది. రాకుమారి ఆ పూజ దీపావళికి ముందు త్రయోదశి నాడు చేయడంతో ఆ రోజు నుంచి ‘ధనత్రయోదశి’ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
ధనత్రయోదశిని ఆయా ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. దక్షిణాదిలో ఆవులను ఆభరణాలతో అలకరించి పూజిస్తారు. వ్యాపార సంస్థలను అందంగా అలంకరిస్తారు. అలాగే మహారాష్ట్రలో ధనత్రయోదశిని ‘నైవేద్య’ అనే పేరుతో నిర్వహిస్తారు. కొత్తమీర విత్తనాలు పొడిచేసి అందులో బెల్లం కలిపి నైవేథ్యం తయారు చేసి, లక్ష్మీదేవికి సమర్పిస్తారు.