- Advertisement -
హైదరాబాద్: ప్రపంచంలో పూలతో దేవ దేవుళ్లను పూజిస్తాం. కానీ ఆ పూలనే పవిత్రమైన.. సౌభాగ్యమైన గౌరమ్మగా పూజించటమే బతుకమ్మ పండుగ. ఇది తెలంగాణ ప్రత్యేకత అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రకృతిని ప్రేమించడం.. జీవన సంప్రదాయంగా మారింది. బతుకును బ్రతుకమ్మా అని వేడుకోవడం తెలంగాణ మట్టిలోని ప్రత్యేకత. ప్రజలు ఎంత అభివృద్ది చెందినా.. మూలాల్ని మరచిపోకుండా.. అటు సంప్రదాయం.. ఇటు సామాజికంగా చేసుకునే పండుగ బతుకమ్మ.
బతుకమ్మ పండుగలో ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతీ పువ్వుకీ ఓ ప్రత్యేకత ఉంది. గుమ్మడి, గులాబీ, గోరింట, కట్ల, కనకాంబరాలు, గునుగు, తంగెడు, సీతజడలు, పట్టుకుచ్చులు, రుద్రాక్ష, బంతి, చామంతి, పోకబంతి, అల్లి, లిల్లి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు పూలే కాదు ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతీ పువ్వు బతుకమ్మగా రూపాంతంరం చెంది పూజలందుకుంటుంది. అంటే బతుకమ్మను పూజిస్తే ప్రకృతిని పూజించినట్లేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
పండుగ సందడితో పాటు పూల లోగిళ్లుగా తెలంగాణ వాకిళ్లు కళకళలాడిపోతుంటాయి. కొత్త శోభను సంతరించుకుంటాయి. సాక్షత్తు ఇంద్రధనస్సే ఇళ్లలోకి దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది ప్రతీ ఇల్లు. బిజీ బిజీ లైఫ్ లో ప్రకృతికి దూరమైపోయిన మనిషి ప్రకృతికి దగ్గరకెళ్లటమే బతుకమ్మ పండుగ.
ప్రకృతినుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే.. ప్రకృతి నుండి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ చెప్పే సందేశం.తెలంగాణ లోగిళ్లలో సిరులొలికించే ప్రకృతి పండుగ బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు భక్తిపారవశ్యంతో జరుపుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది.
పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకు పూల పండుగ. పేద, ధనిక, మధ్యతరగతి అన్న తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాలకు చెందిన ఆడబిడ్డలు ఒక్కటై ఈ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి నుంచి వచ్చిన పూలు తిరిగి ప్రకృతికే సమర్పించటంతో ఈ బతుకమ్మ పండుగలోని మరో విశేషం.
మొక్కల నుంచి.. చెట్ల నుంచి కోసుకొచ్చిన పూలను బతుకమ్మలుగా పేర్చి.. వాటిని ఆటపాటలతో పూజించి.. తిరిగి ప్రకృతికే అంటే నీటిలో కలిపేయటమే బతుకమ్మ పండుగలోని విశిష్టత.
- Advertisement -