

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం నుమాయిష్ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
తొలుత ఆంధ్రాబ్యాంకు స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు సమాచారం. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పలు స్టాల్స్ దగ్ధమయ్యాయి. పొగలు దట్టంగా అలుముకోవడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్క స్టాల్స్‌కు మంటలు వేగంగా విస్తరించాయి. 19 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
భయానక వాతావరణం: కోట్లలో ఆస్తి నష్టం
సందర్శకులు ఒక్కసారిగా బయటకు పరుగు తీయడంతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భయానక వాతావరణం నెలకొంది. మైదానంలోని మొత్తం 2500 స్టాళ్లలో 400కుపైగా స్టాల్స్ అగ్నికి అహూతయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురుకి స్వల్పగాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని హైదరాబాద్ సీపీ తెలిపారు. కానీ, భారీగా ఆస్తి నష్టం జరిగింది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కన్నీటిపర్యంతమవుతున్న స్టాల్స్ నిర్వాహకులు
అగ్నిమాపక వాహనాలను ఎగ్జిబిషన్ ప్రాంతంలో ఉంచకపోవడం వల్లే భారీ ఆస్తి నష్టం జరిగిందని స్టాల్స్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే స్టాల్స్ పూర్తిగా అగ్ని అహూతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్ ఇంజిన్లు సమయానికి రాకపోవడంతో ఆస్తి నష్టం అమితంగా పెరిగిపోయిందని చెప్పారు. తమ స్టాల్స్ అగ్నికి అహూతవడంతో నిర్వాహకులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
జన సంద్రంగా పరిసర ప్రాంతాలు
కాగా, బుధవారం ఒక్కరోజే నుమాయిష్‌కు దాదాపు 30వేల మంది సందర్శకులు వచ్చినట్టు సమాచారం. నాంపల్లి ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో వీరంతా ఒక్కసారిగా ఎగ్జిబిషన్ మైదానం నుంచి బయటకు రావడంతో నాంపల్లి గాంధీభవన్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సందర్శకులు మెట్రోలో టికెట్ లేకున్నా ప్రయాణం చేయవచ్చని మెట్రో రైలు ఎండీ ఎన్వీస్ రెడ్డి తెలిపారు. మెట్రో సర్వీసులను కూడా వేగంగా నడుపుతున్నారు. ఎల్బీ నగర్ వైపు ఐదు మెట్రో రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకులు అక్కడ్నుంచి వేగంగా వారి గమస్యస్థానాలకు పయనమయ్యారు.
ఆందోళన వద్దు: ఈటెల రాజేందర్ ఆరా
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. ఆస్తి నష్టం వివరాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఎగ్జిబిషన్ కార్యదర్శిని ఆదేశించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని ఈటల సూచించారు.








