

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి కారు కూడా విడుదల చేశారు సీఎం చంద్రబాబు.
ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫొటోలను చంద్రబాబు తన ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. రామ్ వాటిని రీట్వీట్ చేశారు. ‘కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో జిల్లాకు నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
భారీ ముందడుగు.. ఇది నిజమే
‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని రామ్.. చంద్రబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు. రామ్ ఈ ట్వీట్ చేయగానే రామ్ అభిమానులతోపాటు టీడీపీ అభిమానులు కూడా రామ్ ట్వీట్ చేయడంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్ అంటూ అభిమాన నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
ఈ క్రమంలో మరోసారి రామ్ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్.. నువ్వు మంచి చెయ్.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సల్లేదు. ముందు నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడ్ని’ అని రామ్ స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌పై కూడా అభిమాన నెటిజనులు మరింత ప్రశంసలు కురిపించారు.








