

హైదరాబాద్: రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఈ కేసు విచారణను కొనసాగించిన హైకోర్టు రేవంత్ రెడ్డిని అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ నివేదికను తమకు సమర్పించాలని మంగళవారం మధ్యాహ్నమే ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే బుధవారం నాటికి కూడా ఇంటెలిజెన్స్ నివేదికను పోలీసులు సమర్పించకపోవడంతో అడ్వకేట్ జనరల్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ మహేందర్ రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరై సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ కల్పించుకుని.. డీజీపీ ఎన్నికల విధుల్లో బీజీగా ఉన్నారని చెప్పారు.
అడ్వకేట్ జనరల్ మాటలను శ్రద్ధగా ఆలకించిన హైకోర్టు.. అయినా సరే డీజీపీ కచ్చితంగా కోర్టులో హాజరుకావలసిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలు అర్థరాత్రి వేళ రేవంత్ రెడ్డి ప్రహరీగోడను దాటుకుని వెళ్లి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయాల్సినంత అత్యవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రశ్నించడంతో అడ్వకేట్ జనరల్ నీళ్లు నమిలారు.








