దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి విడుదలకు రజత్ కుమార్ ఆదేశం, కొడంగల్ చేరిన రేవంత్…

- Advertisement -

revnath-reddy-release

హైదరాబాద్: టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు జడ్చర్లలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో పోలీసుల అదుపులో ఉన్న రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని జడ్జర్ల నుంచి భారీ భద్రత నడుమ కొడంగల్‌కు తరలిస్తున్నారు.

మంగళవారం కోస్గీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో కొడంగల్‌లో అల్లర్లు జరగకుండా ఉండేందుకుగాను ముందస్తుగా మంగళవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆయన సోదరులను, గన్‌మెన్లను పోలీసులు ఎవరికీ తెలియకుండా కొండంగల్ నుంచి జడ్చర్లలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.

కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి…

అయితే రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో.. తక్షణమే ఆయన ఆచూకీ తెలుపాలంటూ ఆయన భార్య గీత తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పోలీసుల వ్యవహారశైలిని తూర్పారబట్టడంతో కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చింది.

ఈలోగా రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత అంటూ వార్తలు వెలువడడం.. వీటన్నింటి నేపధ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీచేశారు.

రేవంత్‌కు స్వల్ప అస్వస్థత…?

పోలీసుల అదుపులో జడ్చర్లలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్న రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన బీపీ పెరగడంతో అక్కడే అందుకు అవసరమైన వైద్య చికిత్స అందించినట్లు సమాచారం. మరోవైపు హైకోర్టు వేసిన అక్షింతలతో ఇటు పోలీసులు, అటు ఎన్నికల అధికారులు దిగివచ్చారు. రేవంత్ రెడ్డిని విడుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డిని తిరిగి భారీ భద్రత నడుమ పోలీసులు కొండంగల్ తీసుకొస్తున్నారు.

రేవంత్ స్టార్ క్యాంపైనర్, అందుకే…

రేవంత్ రెడ్డి స్టార్ కాంపైనర్ అని, అయన రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించ వచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. రేవంత్ ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. రేవంత్ రెడ్డిని ముందస్తుగా అరెస్టు చేయించడం ద్వారా మొత్తానికి కేసీఆర్ తాను అనుకున్నది సాధించారని, రేవంత్ తిరిగి కొడంగల్‌కు చేరుకునేలోగా కోస్గీలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ముగిసిపోతుందని పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

 

- Advertisement -