హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో పోలీసు అధికారుల తీరుపై మంగళవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రేవంత్ రెడ్డి ఆచూకీ తెలపాలంటూ వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించింది.
కోస్గీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా రేవంత్ రెడ్డి ఇంట్లోకి జొరబడి ఆయనతోపాటు, ఆయన సోదరులను, మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను తమతో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఆచూకీ తెలపాలంటూ రేవంత్ రెడ్డి భార్య గీత కోరినా పోలీసుల అధికారులు నోరు మెదపలేదు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. అర్థరాత్రి దాటాక పోలీసులు బలవంతంగా రేవంత్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆయన్ని ఈడ్చుకుని వెళ్లారని ఆయన తరఫున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పకుండా ఆయన కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేశారన్నారు.
అల్లర్లు జరుగుతాయేమో అని…
దీంతో రేవంత్ రెడ్డిని ఎందుకు, ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారంటూ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది, పోలీసులను ప్రశ్నించింది. అల్లరు జరగవచ్చనే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డిని ముందస్తుగా అదుపులోనికి తీసుకున్నామని పోలీసులు న్యాయమూర్తికి వివరించడంతో.. ఆ ఇంటెలిజెన్స్ నివేదిక కాపీని తమకు సమర్పించాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ సందర్భంగా హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అర్థరాత్రి వేళ ఓ పార్టీ నేతను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అంతేకాదు, రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో చెప్పాలని హైకోర్టు కోరింది. రేవంత్ ఆచూకీపై స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను హైకోర్టు ఆదేశించింది.
వికారాబాద్ ఎస్పీ నివేదిక కోసం హైకోర్టు విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. అనంతరం విచారణను ఈరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా వేసింది.