హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టు అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, తాజాగా తెలంగాణ హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.
టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ముందస్తు బెయిలు కోసం రవిప్రకాశ్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అంత అత్యవసరంగా దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది.
మరోవైపు పోలీసులు తన కోసం గాలిస్తున్న నేపథ్యంలో రవిప్రకాశ్ మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టీవీ9ను ఇటీవల అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ టేకోవర్ చేసింది. అయితే వాటాల వివాదంలో సంస్ధ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్.. మరికొందరు కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద కంపెనీ డైరెక్టర్ కౌశిక్ రావ్ పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు.
ఆయన ఫిర్యాదుల ఆధారంగా రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీ, టీవీ9 సీఈవో మాజీ సీఎఫ్‌వో మూర్తిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలో విచారణ కోసం తమ ఎదుట హాజరుకావాలంటూ పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. అయినా వారు హాజరుకాలేదు. దీంతో ఆదివారం హాజరుకావాలంటూ రెండోసారి నోటీసులిచ్చినా రవిప్రకాశ్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.
దీంతో పోలీసులు ఈసారి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు. ఆ నోటీసుకు సంబంధించి ఇచ్చిన గడువు కూడా ముగియడం, మరోవైపు రవిప్రకాశ్ తరుపున హైకోర్టులో దాఖలైన పిటిషన్ కూడా కొట్టివేయడం.. ఇవన్నీ చూస్తోంటే.. ఇక రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే భావిస్తున్నారు.








