26.7 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నేడూ, రేపూ తేలికపాటి నుంచి భారీవర్షాలు

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నేడూ, రేపూ తేలికపాటి నుంచి భారీవర్షాలు

telangana-rains
- Advertisement -

rains

హైదరాబాద్: దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం సాయంత్రం వరకూ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.

ఉత్తర తెలంగాణలో రెండురోజులుగా ముసురు పట్టింది. దాదాపు ఇరవై రోజుల తరవాత రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానల వల్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పైర్లు నీటమునిగాయి.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో వర్షాలు భారీగా కురిశాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో భారీ వర్షం కురిసింది. 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. శనివారం ఖమ్మంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఒక్కరోజులో రెండడుగులు పెరిగింది. ప్రస్తుతం 23 అడుగుల మేర ప్రవహిస్తోంది. నాచేపల్లి-నేలకొండపల్లి మధ్య వాగులో చిక్కుకున్న నలుగురు యువకులను గ్రామస్థులు కాపాడారు. గుండాల మండలం నాగారం గ్రామానికి చెందిన పి.శిరీష అనే గర్భిణికి పురుటినొప్పులు మొదలవ్వడంతో ఏడుమెలికల వాగును దాటించేందుకు ఇబ్బందిపడ్డారు. గ్రామస్థుల సాయంతో ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

మరో రెండు రోజులపాటు…

దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలలో సముద్రమట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇది మరింత ఎత్తుకు వెళ్లి నైరుతి వైపునకు పయనించే అవకాశం ఉంది. దీనిప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. జార్ఖండ్ నుంచి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒడిశా మీదుగా 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తున్నందున అధికారులు స్థానికంగానే ఉండి, అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం రాత్రి సీఎస్ ఎస్కే జోషితో మాట్లాడారు. వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించాలని, 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

వీరే ప్రత్యేకాధికారులు…

సీఎం ఆదేశాల మేరకు ఏడుగురు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు.  ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు జ్యోతిబుద్ధప్రకాశ్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు వికాస్‌రాజ్, కరీంనగర్, పెద్దపల్లికి బీఆర్ మీనా, జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు సందీప్‌కుమార్ సుల్తానియా, వరంగల్ అర్బన్, జనగామకు శివశంకర్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు రాహుల్ బొజ్జా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సురేశ్ చందా ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు.

- Advertisement -