
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారికి 166 మంది బలి అవగా, ఇటు తెలంగాణలోనూ ఇప్పటి వరకు 11 మంది మరణించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మృతుల అంత్యక్రియల నిర్వహణకు సంబంధించి గురువారం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అంత్యక్రియల సందర్భంగా ఏమేం నిబంధనలు పాటించాలో వాటిలో పొందుపరిచింది.
ఇలాగే చేయాలి, తప్పదు…
మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలను, ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అంత్యక్రియల విధులు నిర్వహించే సిబ్బంది ఇతర విధులు నిర్వహించకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: తంగడపల్లి వివాహిత హత్య కేసు.. నడుస్తున్న కారులో అత్యాచారం, హత్య!
మృతదేహాన్ని సంచిలో పెట్టి నేరుగా స్మశానానికి తరలించాలని, అలాగే మృతదేహాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, అంత్యక్రియలు జరిపే సమయంలో అక్కడ ఐదుగురికి మించి హాజరు కాకూడదని ఆదేశించింది.
ఉమ్మి వేయడంపైనా నిషేధం…
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగాంగా బుధవారమే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుండడమే ఇందుకు కారణం.
అయితే ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ కట్టడి మాత్రం సాధ్యం కావడం లేదు. దీనిని నివారించే వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.
చదవండి: కరోనా పెళ్లికి 18 మంది అతిథులు!
మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,734కు చేరుకుంది. చికిత్స అనంతరం 473 మంది కోలుకోగా ఇప్పటి వరకు 166 మంది మరణించారు.
తెలంగాణలోనూ బుధవారం నాటికి 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్ సోకి మరణించగా, 45 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు.








