హైదరాబాద్: తెలంగాణలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం అని, టీఆర్‌ఎస్‌ది కాదన్నారు.
రాజకీయ మనుగడ కోసం ఈ నినాదాన్ని విస్తరింపజేసి ప్రజల భావోద్వేగాలను టీఆర్‌ఎస్ పార్టీ కోసం కేసీఆర్ వాడుకున్నారంటూ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. అలాగే స్వయం పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీఆర్‌ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని, పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, కేసీఆర్ మార్క్ పాలనను బలవంతంగా ప్రజలపై రుద్దారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
గిట్టుబాటు ధర ఒక్కటే శాశ్వత పరిష్కారం…
అలాగే రైతు రుణమాఫీ కూడా తాత్కాలిక ఉపశమనమేనని, పంటలకు గిట్టుబాటు ధర ఒక్కటే శాశ్వత పరిష్కారమని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే తము రైతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చివరి గింజవరకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తామని, వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తామని, భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
తెలంగాణలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పాలనలో ప్రజల భాగస్వామ్యం.. తమ ప్రాధాన్యం అని, నిరుద్యోగ యువతకు ఉపాధి, నైపుణ్యాల మెరుగుకు అవసరమైన శిక్షణ కల్పిస్తామని రేవంత్‌రెడ్డి తెలియజేశారు.