సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ… 26న అధికారిక ప్రకటన!?

jd lakshmi narayana-started new political party
- Advertisement -

jd lakshmi narayana-started new political party

హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయాణ తాజాగా రాజకీయాల్లో వస్తున్నారు.. ఈ నవంబర్ 26న తన పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, అజెండా ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఆయన పార్టీ పేరు ఏమై ఉంటుందోనని ఇటు రాజకీయ నాయకులతోపాటు అటు ప్రజలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తన పార్టీ పేరును ‘జనధ్వని’గా రిజిస్టర్ చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీబీఐ జేడీగా జనం నోళ్లలో ఎక్కువగా నానిన ‘జేడీ’ అన్న పదం కలిసొచ్చేలా పార్టీకి జనధ్వని (జేడీ) పేరుని పెట్టారని చెప్పుకుంటున్నారు.

26న హైదరాబాద్‌లో ప్రకటిస్తారా?

అలాగే… ‘వందేమాతరం’ అనే పేరు కూడా పరిశీలనలో ఉందని లక్ష్మీనారాయణ సన్నిహితులు తెలియజేస్తున్నారు.  అయితే లక్ష్మీనారాయణ మాత్రం చాలావరకు ‘జేడీ’ అన్న పేరుపైనే ఆసక్తి చూపిస్తున్నారట.  26న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన తన పార్టీని ప్రకటిస్తారని.. ఈ కార్యక్రమానికి కొంతమంది ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయని తెలుస్తోంది.

మహారాష్ట్య క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణ.. డిప్యూటేషన్‌పై సీబీఐ జేడీగా వచ్చి బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్, జగన్ అక్రమాస్తులు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసులను ఆయన అత్యంత చాకచక్యంగా డీల్ చేసి నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆ తరువాత ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో లక్ష్మీనారాయణ తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.

కొన్నాళ్లుగా ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.  తాజాగా వినిపిస్తోన్న వార్తలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.  దీనికి తగ్గట్లుగానే ఇటీవల ఆయన కొన్ని చానళ్లకు, న్యూస్ పేపర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా తన రాజకీయ రంగ ప్రవేశం, పార్టీ ఏర్పాటు వంటి విషయాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు.. అన్ని కలిపి చూస్తే… జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటన తథ్యమని అర్థమవుతోంది.

- Advertisement -