హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో కొత్త సినిమా ‘మహర్షి’ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండడంతో.. సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సినిమాలో అధిక భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించడం, భారీ షెడ్యూల్స్ కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అవుతోందని, ముగ్గురు నిర్మాతల్లో ఒకరికి అధికారం ఇవ్వకపోవడంతో అదుపు చేయడం వీలు కావడం లేదని చెప్పుకుంటున్నారు.
గతంలో వంశీ పైడిపల్లి రూపొందించిన ‘ఊపిరి’ సినిమా కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా అవ్వడంతో.. ఆ సినిమా హిట్ అయినా లాభాలు మాత్రం రాలేదు. ఈ విషయాన్ని‘ఊపిరి’ నిర్మాత పీవీపీ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు ‘మహర్షి’ సినిమాలో కూడా అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని సినీవర్గాల టాక్.
నిర్మాతలు సినిమాను లాభాలకు అమ్ముకున్నా.. బయ్యర్లు మాత్రం ఈ కారణంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కనుక మహేష్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు ఖర్చు చేస్తే మంచిదనే అభిప్రాయలు కూడా వినిపిస్తున్నాయి.