వికారాబాద్: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రం మొత్తంలో దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలోనూ, అత్యల్పంగా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ నమోదైంది.
గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగితే, భాగ్యనగరంలో మాత్రం 5 శాతానికి పైగా తగ్గిపోయింది. ఇక, గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ శాతాన్ని ప్రస్తుతం మధిర అధిగమించింది. ఇక్కడ దాదాపు 91.3 శాతం ఓటింగ్ నమోదైంది.
అయితే వికారాబాద్‌లో చిత్రంగా ఓ పోలింగ్ బూత్‌లో పోలైన ఓట్ల కంటే ఈవీఎంలో ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. ధరూర్ మండలంలోని 183వ పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 556 కాగా, శుక్రవారం ఉదయం పోలింగ్ మొదలైన దగ్గర్నించి పూర్తి అయ్యే వరకూ 518 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మాక్ పోలింగ్ కారణమా?
పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు ఈవీఎంలను పరిశీలించగా పోలైన ఓట్ల సంఖ్య 555 చూపించింది. ఇక్కడ 37 ఓట్లు అధికంగా పోలయ్యాయి. పోలైన ఓట్లకు, చూపించిన ఓట్లకు మధ్య వత్యాసం ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే అక్కడ ఓటింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించారని, అ తరువాత అ ఈవీఎంలను క్లియర్ చేయకుండా పోలింగ్ నిర్వహించడం వల్లే 37 ఓట్లు అధికంగా నమోదైనట్టు భావిస్తున్నారు.
మరోవైపు.. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలను శనివారం వెల్లడించి, అవసరమైతే రీపోలింగ్ నిర్వహిస్తామని వికారాబాద్ కలెక్టర్ ఒమర్ జలీల్ తెలిపారు.