షాకింగ్: తెలంగాణలో ‘కరోనా’ కలకలం.. దేశంలో మొత్తం 5 కేసులు, భయం లేదన్న మంత్రి ఈటల…

corona-virus
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్(కోవిడ్-19) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం ఆ కరోనా బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఈ వైరస్ సోకిన బాధితుడు తొలుత బెంగళూరుకు, ఆ తరువాత హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, అతడు బహిరంగంగా తిరిగాడని, బస్సుల్లో ప్రయాణించాడని సమాచారం. దీంతో అతడి నుంచి మరెంత మందికి ఆ వైరస్ సోకి ఉంటుందో అన్న అనుమానాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

2019 నవంబర్‌ నెలలో చైనాలోని వూహాన్‌ నగరంలో వెలుగు చూసిన ప్రమాదకరమైన ఈ వైరస్‌ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాలకుపైగా విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటికే వేలాది మంది మృత్యువాతకు గురయ్యారు.

మన దేశంలో మొత్తం 5 కేసులు…

మన దేశంలో ఇప్పటివరకు మొత్తం 5 కరోనా కేసులు నమోదయ్యాయి. తొలుత కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక కేసు.. తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో పాజిటివ్ కేసు నమోదవడంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యాయి.

దుబాయ్ నుంచి కరోనా బాధితుడు తొలుత బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం. గత నెల 22న బస్సులో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బాధితుడు అటు బెంగళూరులోగాని, ఇటు హైదరాబాద్‌లోగాని ఎంతమందిని కలిసి ఉంటాడు? ఇతడి ద్వారా ఈ వైరస్ మరెంతమందిలో చేరి ఉంటుందనే ప్రశ్న ఇప్పుడు అందరి మదినీ తొలుస్తోంది.

ఆ 80 మంది పరిస్థితి ఏమిటి? 

ప్రభుత్వం అధికారికంగా చెబుతోన్న లెక్కల ప్రకారమే బాధితుడు 80 మందిని కలిసినట్టు తేలింది. ఇక వారు  మరెంత మందిని కలిసి ఉంటారో? వైరస్ బాధితుడు బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌ వచ్చిన సమయంలో ఆ బస్సులో అతడితోపాటు ప్రయాణించిన 27 మంది.. ఆ తరువాత ఇన్ని రోజుల్లో వందల మందిని కలిసి ఉంటారని అనుమానిస్తున్నారు.

అలాగే ఈ వైరస్ బాధితుడు హైదరాబాద్‌లో 9 రోజులపాటు తిరిగాడని, అతడు తొలుత చికిత్స చేయించుకున్న అపోలో ఆస్పత్రిలోనే 23 మంది బాధితులను గుర్తించారు. వీరు కాకుండా అతడు ఇంకా ఎవరెవరిని కలిసి ఉంటాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు, బాధితులు అందరినీ గుర్తించడం కష్టమేనని కూడా వారు చెబుతున్నారు.

వారికి మాత్రమే డేంజర్…

కరోనా వైరస్ బాధితుడు అటు బెంగళురులోగాని ఇటు హైదరాబాద్‌లోగాని ఎక్కువ మందిని కలవడమే అధికారులను ఎక్కువగా  కలవరపెడుతోంది. ఎందుకంటే, బాధితుడు నేరుగా కలిసిన వారికి మాత్రమే ఈ వైరస్‌ విస్తరించే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.  అందులోనూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లలకు ఇది త్వరగా వ్యాప్తిస్తుందట.

నిజానికి ఇతర దేశాల నుంచి వచ్చి.. జలుబు, దగ్గుతో బాధపడుతూ చికిత్స కోసం పలువురు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారని, ఇలాంటి లక్షణాలతో వచ్చిన వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని ఆయా ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అయితే ఆ ప్రకారం ప్రైవేటు ఆసుపత్రుల వారు వ్యవహరించడంలేదనే చర్చ జరుగుతోంది.

గాంధీ ఆసుపత్రిలో చికిత్స…

ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుడికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు, శిక్షణ పొందిన నర్సులు చికిత్స అందిస్తున్నారు. కేరళలో ఈ వైరస్‌ సోకిన ముగ్గురు వ్యక్తులకు అక్కడి వైద్యులు చేసిన చికిత్సతో పూర్తిగా నయమైంది.

దీంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి కూడా అదే తరహా చికిత్స అందించేందుకు సంబంధిత అధికారులు కేరళ డాక్టర్లను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు కోవిడ్‌-19 బాధితులకు అందించాల్సిన చికిత్స విధానాల గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. కరోనా వైరస్ కూడా స్వైన్‌ఫ్లూ తరహాలోనే శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో ఫ్లూ నివారణకు అనుసరించే విధానంలోనే ఈ బాధితుడికి చికిత్స చేయనున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

ఇవీ కోవిడ్‌ లక్షణాలు…

జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కోవిడ్‌ సాధారణ లక్షణాలు. 20 శాతం కేసుల్లో గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చైనా వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం ఇటువంటి లక్షణాల్లో 81% కేసులు తేలికపాటివి, 14 శాతం మందికి మాత్రమే ఆసుపత్రి అవసరం ఏర్పడుతుంది.

ఇక 5 శాతం మందికి వెంటిలేటర్‌ లేదా క్లిష్టమైన సంరక్షణ నిర్వహణ చర్యలు అవసరమవుతాయి. కరోనా వైరస్ లక్షణాలు 2 నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. శ్వాసకోశ స్రావాల ద్వారా ఈ వైరస్ బాధితుల నుంచి ఇతరులకు సోకుతుంది.

దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే నీటి బిందువుల ద్వారా .. కలుషితమైన వస్తువులు, దగ్గరి పరిచయాల ద్వారా పరోక్షంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -