
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. బ్యాంకు తాజా నిబంధన ప్రకారం.. ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయని వారు తమ ఖాతాల్లోంచి నగదును విత్ డ్రా చేసుకోలేరు. ఒకవేళ ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే, అలాంటి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు దానిని ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని బ్యాంకు గతంలోనే స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారు మార్చి 1, 2020 నుంచి తమ ఖాతా నుంచి నగదును తీసుకోలేరని, వారి ఖాతా స్తంభించిపోతుందని పేర్కొంది.
నిజానికి తమ బ్యాంకు ఖాతాదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని గతంలోనే ఎస్బీఐ కోరింది. ఇందుకు అవసరమైన పత్రాలతో బ్యాంకు బ్రాంచిలను సంప్రదించాలని, నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న వారు ఇంట్లోంచే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని కూడా సూచించింది.
ఇతర బ్యాంకులకూ ఇదే నిబంధన…
ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి సవరించిన నిబంధన ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు ఫిబ్రవరి 28వ తేదీలోపు అన్ని బ్యాంకులు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని ఖాతాదారుల ఖాతాను బ్యాంకులు స్తంభింపజేయవచ్చు.
కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, కరెంట్/టెలిఫోన్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ పే ఆర్డర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, సేల్ డీడ్, లీజ్ అగ్రిమెంట్, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డు తదితర డాక్యుమెంట్లలో ఏవి ఇచ్చినా సరిపోతుంది. ఈ పత్రాలన్నింటినీ అంగీకరిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
మీరు ఎస్బీఐ ఖాతాదారు అయితే, మీ ఖాతా స్తంభించకుండా ఉండాలంటే తక్షణమే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. పైన చెప్పిన విధంగా… అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ పత్రాలతో బ్యాంకు బ్రాంచికి వెళ్లిగానీ.. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారాగానీ ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? బయల్దేరండి…







