రిలయన్స్ మరో సంచలనం: ‘జియో ఫైబర్’ నెలవారీ ప్లాన్లు.. రూ.399 నుంచి మొదలు…

jiofiber-new-monthly-plans
- Advertisement -

ముంబై: రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి నెలవారీ ప్లాన్లు ఇకమీదట రూ.399 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. 

సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే జియో ఫైబర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ కొత్త ప్లాన్లకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతారని వివరించింది. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1600 నగరాలు, పట్టణాలలో జియో ఫైబర్ సేవలు అందుతున్నాయని, ప్రతి ఇంటికీ జియో ఫైబర్‌ను చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

రూ.399 బ్రాంజ్ ప్లాన్‌లో…

ఇది రిలయన్స్ జియో అందిస్తోన్న అతి చౌకైన నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ఇందులో డేటా స్పీడ్ 30 ఎంబీపీఎస్.. అదీ అన్‌లిమిటెడ్. అంటే డౌన్‌లోడ్, అప్‌లోడ్ డేటా వేగంపై ఎలాంటి పరిమితి ఉండదు. 

గతంలో అయితే నిర్దేశించిన పరిమితి దాటిన తరువాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోయేది. ఈ కొత్త ప్లాన్‌లో మాత్రం ఎలాంటి కటాఫ్ ఉండదు. అంతేకాదు, ఈ ప్లాన్‌లో ఉచిత కాల్స్ కూడా లభిస్తాయి.  

రూ.699 సిల్వర్ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ వేగం‌…

జియో ఫైబర్ మరో ప్లాన్ ‘సిల్వర్’లో నెలకు రూ.699 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్. ఈ ప్లాన్‌లో కూడా ఫ్రీ కాలింగ్ సదుపాయం ఉంది. 

‘గోల్డ్’ ప్లాన్‌లో..

ఇక రూ.999 పేరిట ప్రకటించిన ‘గోల్డ్’ ప్లాన్‌లో.. డేటా వేగం 150 ఎంబీపీఎస్ ఉంటుంది. దీంతోపాటు 11 ఓటీటీ యాప్స్ కూడా ఉచితం. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ వంటి యాప్స్ ఉంటాయి. 

రూ.1,499 డైమండ్ ప్లాన్‌లో…

ఇందులో డేటా స్పీడ్ 300 ఎంబీపీఎస్. గోల్డ్ ప్లాన్‌లో అందించే 11 ఓటీటీ యాప్స్‌కు అదనంగా నెట్‌ప్లిక్స్ కూడా ఉచితం. 

ఇక నెలకు రూ.2,499కి ‘డైమండ్ ప్లస్’ ప్లాన్‌లో స్పీడ్ 500 ఎంబీపీఎస్ ఉంటుంది. అయితే 4000 జీబీ వరకు ఈ స్పీడ్ లభిస్తుంది. ఆ తరువాత స్పీడ్ తగ్గుతుంది. ఇందులోనూ 12 ఓటీటీ యాప్స్ ఉచితంగా లభిస్తాయి.

అలాగే రూ.3,499కి ‘ప్లాటినమ్’ ప్లాన్‌లో స్పీడ్ 1 జీబీపీఎస్, అయితే 7500 జీబీ వరకు ఈ స్పీడ్ లభిస్తుంది. ఆ తరువాత స్పీడ్ తగ్గుతుంది. ఇందులోనూ 12 ఓటీటీ యాప్స్ ఉచితంగా లభిస్తాయి.

ఇక నెలకు రూ.8,499కి లభించే ‘టైటానియం’ ప్లాన్‌లో కూడా 1 జీబీపీఎస్ డేటా వేగం ఉంటుంది. కాకపోతే  15,000 జీబీ వరకు మాత్రమే ఈ స్పీడ్ లభిస్తుంది. ఆ తరువాత స్పీడ్ తగ్గుతుంది. ఇందులోనూ 12 ఓటీటీ యాప్స్ ఉచితంగా లభిస్తాయి.

నెల రోజులు ‘ఫ్రీ ట్రయల్’ కూడా…

కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఫైబర్ నెల రోజులపాటు ఫ్రీ ట్రయల్ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ఆగస్టు 15 నుంచి 31 మధ్య జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఫ్రీ ట్రయల్ ప్రయోజనాలు లభిస్తాయి. 

నెల రోజుల ట్రయల్ తరువాత కనెక్షన్ వద్దనుకుంటే.. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా డబ్బు వాపస్ చేస్తామని రిలయన్స్ జియో చెబుతోంది. 

 

 

- Advertisement -