
మెదక్: రాజకీయాలు అప్పుడప్పుడు అదృష్టం మీద కూడా నడుస్తుంటాయి. ఆ అదృష్టం ఉంటే ఊహించని విధంగా పదవులు వారి చెంత చేరుతాయి. ఇక ప్రజాభిమానం ఉన్న అదృష్టం లేక కొందరు కొన్ని పదవులు కోల్పోవాల్సి వస్తుంది.
ఈ రెండిటికి ఉదాహరణంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండల అధ్యక్ష ఎంపిక నిలిచింది. ఇటీవల వెలువడిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలకి గాను…కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి.
అయితే ఇరు పార్టీలకు బలం సమానంగా ఉన్నందున ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నర్సాపూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో లాటరీ తీశారు. అయితే అదృష్టం కాంగ్రెస్ ఎంపిటీసీ సభ్యురాలు హలావత్ జ్యోతి తలుపుతట్టింది.లాటరీలో ఆమె ఎంపీపీగా ఎన్నికైంది.
ఇక అటు పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ నాయకురాలు, చిప్పల్‌తుర్తి ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణినాయక్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుడి పదవులు మాత్రం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి దక్కడం కొంత ఊరట కలిగించే అంశం.








