సీఎం కాదు.. కమీషన్ మ్యాన్: కేసీఆ‌ర్‌పై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

khushboo-comments-on-kcr
- Advertisement -

హైదరాబాద్: ఏఐసీసీ అధికార ప్రతినిధి, తమిళ సినీనటి ఖుష్బూ.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం కాదని, కమీషన్ మ్యాన్ అని దుయ్యబట్టారు.

కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్ ఒక్కరేనంటూ మండిపడ్డారు. రూ.300కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న కేసీఆర్ కు సొంత కారు కూడా లేదంట.. అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ అవినీతిలో రెండోస్థానంలో, నిరుద్యోగంలో మూడోస్థానంలో ఉందని అన్నారు.

మహిళలంటే ఒక్క కవితేనా?

బతుకమ్మ చీరల కొనుగోళ్లలో రూ.220 కోట్లు దోచుకున్నారని ఖుష్బూ ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రేమలో ఉన్నాయని ఖుష్బూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 11మంది మహిళలకు టికెట్లు ఇస్తే.. టీఆర్ఎస్ ముగ్గురికే ఇచ్చిందన్నారు. కేసీఆర్‌కు మహిళలంటే ఒక్క కవితేనని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో నకిలీ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని ఖుష్బూ అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు ఇస్తామని, రేషన్ దుకాణాల ద్వారా 9రకాల వస్తువులను అందిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని అన్నారు.

- Advertisement -