విశాఖపట్నం: పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులకు.. ఈ పరీక్షకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అందరు పోలీసులకు కాదులేండి.. విశాఖ జిల్లా వాకనపల్లి గిరిజన మహిళలపై జరిగిన లైంగిక దాడిలో నేరారోపణ ఎదుర్కొంటున్న 13 మంది పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది
ఈనెల 30వ తేదీలోపు ఆ ప్రక్రియ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట నాగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేసును ఈనెల 30కి వాయిదా వేశారు.
అసలేం జరిగిందంటే…
2008 ఆగస్టు 2న కొంతమంది గ్రేహౌండ్స్ పోలీసులు తనిఖీల నెపంతో విశాఖ జిల్లా గిరిజన ప్రాంతమైన జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంపై దాడి చేశారు. ఆ సమయంలో కొంతమంది గిరిజన మహిళలపై పోలీసులు లైంగికి దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది.
ఈ కేసు పలు మలుపులు తిరిగి చివరికి విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విచారణకు వచ్చింది. గిరిజన మహిళల అభ్యర్థన మేరకు హైకోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. అయితే పోలీసులు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ డిపార్టుమెంట్ జారీ చేసిన ఒక లేఖను కోర్టుకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు జరపాలని ప్రాసిక్యూషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆ 13 మంది పోలీసులకు పరీక్షలు నిర్వహించాలని.. ఆ నివేదికను ఈనెల 30లోపు న్యాయస్థానానికి సమర్పించాలని సూచించారు.