ఘోర ప్రమాదం: సైనిక ఆయుధ గోదాంలో భారీ పేలుడు… ఆరుగురు మృతి

Six Killed Several Injured in Explosion At Armys Ammunition Depot
- Advertisement -

Six Killed Several Injured in Explosion At Armys Ammunition Depot

ముంబై: దేశంలోనే అతిపెద్ద సైనిక ఆయుధ గోదాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మందుగండు సామగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో పుల్గావ్ ఆయుధ గోదాంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. గడువు తీరిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుళ్లు జరిగినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు కూలీలు ఉన్నారు. బహిరంగ ప్రదేశంలోనే ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు…

పుల్గావ్‌ గోదాం దేశంలో సైన్యానికి చెందిన అతిపెద్ద ఆయుధ గోదాం. బాంబులు, గ్రనైడ్లు, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను ఇక్కడ నిల్వ చేస్తారు. దేశంలోని పలు ఫ్యాక్టరీల్లో తయారు చేసిన ఆయుధాలను ఇక్కడకు తీసుకొచ్చి భద్రపరుస్తారు. అక్కడి నుంచి ఫార్వర్డ్‌ బేస్‌లకు తరలిస్తుంటారు.

ఈ ఆయుధ గోదాంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు సంభవించాయి. 2016 మే నెలలో ఇదే గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ప్రమాదంలో రక్షణ శాఖకు చెందిన 16 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -