సీఎల్పీ విలీనంపై హైకోర్టుని ఆశ్రయించనున్న కాంగ్రెస్..

congress-symbol
- Advertisement -

హైదరాబాద్: గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీ విలీనం గురించి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందించిన విషయం తెలిసిందే. తామంతా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యామని ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో చేరాలని నిర్ణయించుకున్నందున తమను ఆ పార్టీలో విలీనం చేయాలని లేఖలో కోరారు.

ఈ క్రమంలో 10వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు శాసనసభ కార్యదర్శి ఓ ప్రకటన జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 6కి పడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది.

ఈ నేపథ్యంలో విలీన వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయించనున్నామని, అక్కడి తీర్పును బట్టి లోక్‌పాల్‌ను కూడా ఆశ్రయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 9 నుంచి టీఆర్ఎస్ వైఖరిపై నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు.

అలాగే మరో సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… 2016లో టీడీపీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ బులెటెన్ ఇస్తే, దానిని తాను హైకోర్టులో సవాల్ చేశానని ఆయన గుర్తు చేశారు.

అప్పుడు 90 రోజుల్లో అనర్హత పిటిషన్లను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ప్రస్తుతం కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ ఇలాంటి ప్రక్రియలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. పార్టీ విలీన ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి చేతుల్లో మాత్రమే ఉంటుందని.. స్పీకర్ పరిధిలో ఉండదని రేవంత్ స్పష్టం చేశారు.

చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్… టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం
- Advertisement -