

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే యోచనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేయాలని, తద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆయన యోచిస్తున్నట్టు విశ్వనీయ వర్గాల భోగట్టా.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కనీసం 16 స్థానాలనైనా గెలుచుకోగలిగితే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. దీనికితోడు తాను కూడా రాష్ట్రం వదిలి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, కాంగ్రెస్, బీజేపీయేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. సుఖేందర్రెడ్డికి రాష్ట్ర కేబినెట్లో స్థానం కల్పించాలని, తద్వారా ఖాళీ అయ్యే నల్గొండ లోక్సభ స్థానం నుంచి తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకేనా?
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్ ఆ దిశగా మరింత చురుకుగా వెళ్లేందుకు నల్గొండ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తుండడం తొలి అడుగుగా చెబుతున్నారు.
మరోవైపు లోక్సభ ఎన్నికల విషయంలో కేసీఆర్కు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. 2004లో ఆయన తొలిసారి కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2006, 2008 సంవత్సరాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసిన ఆయన ఆ రెండు చోట్లా విజయ బావుటా ఎగురవేశారు.
అప్పట్లో కేసీఆర్కు మెదక్లో 6,57,492 ఓట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత కేసీఆర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మెదక్ లోక్సభ స్థానానికి మళ్లీ ఉప ఎన్నిక జరగ్గా.. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్కే చెందిన కె.ప్రభాకర్ రెడ్డి అక్కడ విజయం సాధించారు.
ఇప్పుడు మళ్లీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసి గెలిచిన నల్గొండ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన లోక్సభకు వెళితే.. రాష్ట్రంలో ఆయన తనయుడు, ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సీఎం అవుతారని అంటున్నారు.








