28.2 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ 18న తెలంగాణ కేబినెట్ విస్తరణ, 8 మందికే చాన్స్! కొత్తగా నలుగురు, స్పీకర్‌గా ఈటల…?

18న తెలంగాణ కేబినెట్ విస్తరణ, 8 మందికే చాన్స్! కొత్తగా నలుగురు, స్పీకర్‌గా ఈటల…?

kcr-cabinet-expansion
- Advertisement -

kcr-cabinet-expansion

హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 18న క్యాబినెట్ విస్తరణకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జనరల్ అడ్మినిస్ట్రేషన్(జీఏడీ), ప్రోటోకాల్ శాఖలకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం గత డిసెంబర్ 13న కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేశారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మహమూద్ అలీని అదేరోజున తన మంత్రి వర్గంలోకి తీసుకుని ఆయనకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు.

చదవండి: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. నల్గొండ నుంచి లోక్‌సభ‌కు పోటీ!?

అప్పట్నించి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు మంత్రి వర్గంలో తామెప్పుడు చేరతామా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం క్యాబినెట్ విస్తరణపై దృష్టిపెట్టలేదు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అయితే ఒకవేళ కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించినా.. ఆయన తొలివిడతగా తన మంత్రి వర్గంలోకి 6 నుంచి 8 మందిని మాత్రమే తీసుకుంటారని ప్రచారం జరిగింది.

ఇటీవల ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేశారు. దీంతో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ కూడా జరగనుందనే అందరూ భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ తేదీ కూడా ఫిక్స్ చేయడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

గత ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్‌లలో ఎవరో ఒకరినిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని, వీరితోపాటు గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇక కొత్త ఎమ్మెల్యేలు నలుగురిని మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తోంది. ఈ రేసులో గుత్తా సుఖేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

స్పీకర్‌గా ఈటల రాజేందర్?

ఇప్పటికే ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. అలాగే ఈసారి స్పీకర్ పదవి రేసులో గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అయితే స్పీకర్ పదవికి ఆయన సుముఖంగా లేరనే ప్రచారం కూడా మరోవైపు జోరుగా సాగుతోంది. మరి ఈ విషయంలో.. సీఎం కేసీఆర్‌దే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

మొత్తంమ్మీద మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపడం, దీనికి ఈ నెల 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించడం, ఈ మేరకు సీఎంఓ నుంచి సోమవారం ఆదేశాలు కూడా జారీ కావడంతో ఇప్పటివరకు నిస్తేజంగా ఉన్న టీఆర్ఎస్ వర్గాల్లో కాస్త కదలిక వచ్చినట్లయింది. ఎమ్మెల్యేలు ఎవరికి వారే తమకు మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదంటూ హల్‌చల్ చేస్తుండడంతో రాజకీయంగా తెలంగాణలో జోష్ కనిపిస్తోంది.

- Advertisement -