
నిజామాబాద్: నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం దేశానికి అవసరమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. తూటాకు తూటాతో సమాధానం చెప్పే సమర్థత, ప్రపంచ దేశాలు మన వెనుకే నిలిచేలా చేసిన రాజనీతిజ్ఞుడు మోడీ అని అన్నారు. ఈ దేశాన్ని, ప్రజలను సంరక్షించే సత్తా ఉన్న మోడీని తిరిగి ప్రధానిని చేసేందుకు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు.
మెదక్, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్ స్థాయి సమావేశం బుధవారం నిజామాబాద్‌లో నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు, శక్తికేంద్రాలు, బూత్ స్థాయి కార్యకర్తలు హాజరైన సమావేశంలో అమిత్ షా పాల్గొని రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎవర్ని ఎన్నుకుంటారు?
కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లో మన సైనికుల పీకలు కోస్తున్నా మౌనం వహించేవారని.. తామొచ్చాక మెరుపుదాడులతో సమాధానం చెప్పామని అమిత్ గుర్తు చేశారు. దౌత్య నీతితో ప్రపంచ దేశాలను మెప్పిస్తూనే ఉగ్రవాదులను అరెస్ట్ చేసేలా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదేనని అమిత్‌షా పేర్కొన్నారు.
ఇంత జరిగితే.. దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని అడుగుతున్న కాంగ్రెస్, చంద్రబాబు, మమతా బెనర్జీలను ఏమనాలో అర్థం కావటం లేదన్నారు. నీతి, సిద్ధాంతం లేని పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడుతూ దేశ గౌరవాన్ని, సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం వారికే చెల్లిందని విమర్శించారు. ఇలాంటి వారికి అధికారం ఇస్తే దేశం సురక్షితంగా ఉంటుందా..? అని అమిత్ షాప్రశ్నించారు.
పాకిస్థాన్‌కు దీటైన జవాబు ఇచ్చిన మోడీ కావాలో.. సంకుచిత భావం కలిగిన కూటమి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం దేశానికి ఎంతైనా ఉందన్నారు. అమిత్ షా తన ప్రసంగంలో రాహుల్ గాంధీని రాహుల్ బాబాగా పలుమార్లు పేర్కొంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరవుతారంటూ తాను చాలా రోజులుగా అడుగుతుంటే.. సమాధానం లేదన్నారు.
అయితే, ముంబైకి చెందిన ఓ కార్యకర్త మాత్రం వాట్సప్‌లో.. ‘సోమవారం అఖిలేష్ యాదవ్, మంగళవారం మాయావతి, బుధవారం స్టాలిన్, గురువారం చంద్రబాబు, శుక్రవారం శరద్‌పవార్, శనివారం మమత, ఆదివారం సెలవు దినం. ఇలా వారి పాలన కొనసాగుతుంది’ అంటూ ఆసక్తికర పోస్టు పెట్టారంటూ చురకలంటించారు.
కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేయాలంటోంది.. వారు గత పదేళ్లు అధికారంలో ఉండి రూ.53 వేల కోట్లు రుణమాఫీకి వెచ్చించించారని.. తాము కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏడాదిలోనే రూ.75 వేల కోట్లు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. పేదలకు వంటగ్యాస్, విద్యుత్తు సౌకర్యం, మరుగుదొడ్లు, ఆరోగ్య బీమా వంటి పథకాలను అందించామని పేర్కొన్నారు. ఈ విషయాలను జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు అమిత్ షా పిలుపునిచ్చారు.
కేసీఆర్‌ది మైండ్ గేమ్: తెలంగాణకు అధిక నిధులిచ్చాం
గతంలో తెలంగాణకు ఐదేళ్లలో రూ.16 వేల కోట్ల నిధులు వచ్చేవని, తాము మాత్రం నాలుగున్నరేళ్లలో రూ.2,45,900 కోట్ల నిధుల వివిధ రూపాల్లో ఇచ్చామని అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 16 మేము, ఒకటి ఎంఐఎం అంటూ కేసీఆర్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు ఇపుడు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలు దేశం కోణంలో ఆలోచించి మోడీకి ఓటు వేయనున్నారని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ 16 పార్లమెంటు స్థానాలు గెలుస్తామంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని, అసలు ఈ ఎన్నికలకు ఆయనకు సంబంధమే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. రానున్నవి దేశం కోసం, ప్రధాని పదవి కోసం జరిగే ఎన్నికలని ప్రజలకు తెలుసన్నారు. ఈ సమావేశంలో దత్తాత్రేయ, గంగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, నేతలు కిషన్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, అరవింద్, శ్రీనివాస్, భూపతిరెడ్డి, బాబుమోహన్, ఇంద్రసేనారెడ్డి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.








