23.2 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ డేటా చోరీపై దర్యాప్తు ముమ్మరం: సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు

డేటా చోరీపై దర్యాప్తు ముమ్మరం: సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు

- Advertisement -

హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్ శ్వేత, సైబరాబాద్ సైబర్‌క్రైమ్స్ డీసీపీ రోహిణిప్రియదర్శిని, నారాయణపేట జిల్లా ఎస్డీపీవో జీ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీఎస్పీ బీ రవికుమార్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎన్ శ్యామ్‌ప్రసాద్‌రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్, హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్లు బీ రమేశ్, జీ వెంకటరామిరెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు. సిట్ వెంటనే దర్యాప్తును ప్రా రంభించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే కేసు వివరాలను సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుల నుంచి సిట్ తీసుకున్నట్టు తెలిసింది. ఐటీగ్రిడ్స్ సంస్థపై కేసు నమోదు, విచారణ, దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, ఐటీగ్రిడ్స్ నుంచి సేకరించిన సర్వర్లు, ఇతరత్రా పత్రాలు సహా అన్నింటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

మాదాపూర్‌తోపాటు ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా నమోదయిన అన్ని కేసులను సిట్‌ దర్యాప్తు చేస్తుందని, సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్లతోపాటు సీఐడీ విభాగం కూడా ఇందుకు సహకరించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేది జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సమాచారం సేకరించారు..

సేవామిత్ర మొబైల్‌ యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సర్వేలు నిర్వహించి వందలమంది ఓట్లు తొలగించి ఉంటారన్న అనుమానాలున్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అది నలుగురు ఓటర్లను తొలగించినట్టు వెలుగులోకి రావడం ద్వారా నేరపూరిత చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోందన్నారు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సేవామిత్ర యాప్‌ కార్యచరణను వివరించారు. ‘హైదరాబాద్‌ మధురానగర్‌ వాసి జి.దశరథరామి రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 2న కేసు నమోదు చేసుకున్నాం. సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీగ్రిడ్స్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో సర్వే పేరుతో వ్యక్తిగతంగా, ఫోన్‌ ద్వారా ఓటర్లనుంచి సమాచారం సేకరిస్తోంది. ఓటర్లు ఏ పార్టీకి చెందిన వారు? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసేందుకు ఇష్టపడుతున్నారు? అన్న అంశాలను తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ఈ సంస్థ ప్రతినిధులు ఒక ప్రశ్నావళిని రూపొందించారు’ అని తెలిపారు.

‘ఓటర్లు నియోజకవర్గం పరిధిలో ఉన్నారా? వేరే ప్రాంతాల్లో నివస్తున్నారా? అని తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వతంగా నివసిస్తూ ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న ఓటర్లను జాబితాలో తొలగిస్తున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్‌ విభాగానికి మా నివేదికలను సమర్పిస్తాం’ అని అంజనీకుమార్ తెలిపారు.

ఫిర్యాదిదారు దశరథరామిరెడ్డి తన ఫిర్యాదుతో పాటు అమెరికాలోని జార్జియాలో గతేడాది గవర్నర్‌ ఎన్నిక సందర్భంగా ఇలాగే జరిగిందంటూ నకలు పత్రాలు సమర్పించారని అంజనీ కుమార్‌ తెలిపారు. పోలింగ్‌కు ముందు నల్లజాతీయులైన 3.40లక్షల మంది ఓటర్లను తొలగించడంతో కెంప్‌ గెలిచినట్టు ఫిర్యాదిదారు తమకు వివరించారని తెలిపారు.

కాగా, ఐటీగ్రిడ్స్ సంస్థలోని కంప్యూటర్లు, సర్వర్లనుంచి వెలికితీసిన 80 జీబీ పరిమాణంలోని డాటా గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి వెళ్లింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కార్యాలయంలోని అధికారులను కలిసి ఐటీగ్రిడ్స్ సంస్థ వద్ద ఉన్న డాటా గురించి ఆరా తీయనుంది.

ఇది ఇలా ఉండగా, సైబరాబాద్ పోలీసులు బుధవారం అమెజాన్ వెబ్‌సర్వీస్‌కు 91 సీఆర్పీసీ నోటీసులను జారీచేశారు. ఐటీగ్రిడ్స్ సంస్థ డాటాలో కొంత భాగాన్ని కాన్ఫిడెన్షియల్ కిందకు మార్చుకుని, అమెజాన్ వెబ్ సర్వీసులో భద్రపర్చుకున్నట్టు ప్రాథమిక సమాచారం. దీనిపై ఇప్పటికే జారీచేసిన నోటీసుకు అమెజాన్ సర్వీస్ స్పందించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీచేశారు.

చదవండి: డేటా చోరీపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు, బీజేపీ నేతలు కూడా…

- Advertisement -