
కడప: ప్రస్తుతం ఏపీలో రాజకీయం రోజుకో రంగు పులుముకుంటోంది. వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలని సిద్ధం చేస్తున్నాయి. అలాగే కొందరు నేతలు కూడా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పక్క పార్టీలవైపు కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వలసల రాజకీయం జోరుగా సాగుతుంది.
ఇకపోతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు, అలాగే స్వతంత్ర సంస్థలు కూడా సర్వేలు చేయడం పరిపాటే. ఈ సమయంలోనే కడప జిల్లాకి చెందిన సర్వే వివరాలని ఒకసారి పరిశీలిస్తే… కడప జిల్లా రాజకీయం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తుంది అని చెప్పవచ్చు.
కడప.. ప్రతిపక్ష పార్టీ నేత, వైసీపీ అధినేత సొంత జిల్లా. అలాగే వైసీపీకి కంచుకోట లాంటిది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఒక్క రాజంపేట నియోజక వర్గం తప్ప, మిగిలిన అన్ని నియోజకవర్గాలలో వైసీపీ తన హవాని చూపించింది.
కడపలో టీడీపీ ఏ మేర ప్రభావం చూపుతుంది…
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కడప రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలని శాసించే స్థాయికి చేరుకున్నాయి. వైసీపీకి కంచుకోట లాంటి ఈ జిల్లాలో ఎలాగైనా పాగా వేసి, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ఇప్పటికే వ్యూహరచన చేస్తోంది.
అలాగే మరో ముఖ్య విషయం.. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొన్నటి వరకు బద్ద శత్రువులుగా ఉన్నటువంటి అది నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసిపోవడంతో కడప రాజకీయం ఒక్కసారిగా ఊహించని మలుపుతిరిగింది.
టీడీపీ కడపలో వీలైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకొని వైసీపీకి షాక్ ఇవ్వాలని చూస్తుంటే.. కడపలో ఈసారి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనీ వైసీపీ తహతహలాడుతోంది. ఇకపోతే కడపలో మరో ముఖ్య నియోజకవర్గం బద్వేల్. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన ఎమ్మెల్యే జయరాములు ఆ తరువాత మారిన పరిస్థితుల దృష్ట్యా టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ మరో బలమైన నేత కోసం వైసీపీ వేట ప్రారంబించింది.
మరో ముఖ్య విషయం కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి.. గత ఎన్నికల్లో పోటీయే చేయలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు వచ్చినప్పటికీ, రెండు రోజుల ముందు ఒక సమావేశంలో మాట్లాడుతూ టీడీపీని జిల్లాలో లేకుండా కూకటి వేళ్ళతో సహా పీకిపారేస్తానంటూ ఆయన ఆవేశంగా చెప్పుకురావడం గమనార్హం.
ఇకపోతే సర్వే వివరాలని ఒకసారి చూస్తే.. మొత్తం కడప జిల్లాలో 10 నియోజకవర్గాలను ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని తెలుస్తోంది. పోయిన ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్క సీటు కూడా టీడీపీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మరో పార్టీ అయిన జనసేన కడపలో ఏమాత్రం ప్రభావం చూపదని సర్వే చెబుతోంది. ఇక ఈ సర్వే ఫలితాలు నిజమో కాదో తెలుసుకోవాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.








