
హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఇందిరా పార్క్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే భట్టి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో…ఆయన దీక్షని పోలీసులు భగ్నం చేశారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. దీంతో షుగర్ లెవెల్స్ పడిపోయి…ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు.
ఇదిలా ఉంటే దీక్ష నేపథ్యంలో నిన్న భట్టి మీడియాతో మాట్లాడుతూ…కేసీఆర్, కేటీఆర్.. పొలిటికల్ టెర్రరిస్టులని, ఇలాంటి వారికి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ వెన్నులో భయం మొదలైందని, అందుకే సీఎల్పీ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని భట్టి డిమాండ్ చేశారు. దేశంలో ఫిరాయింపులపై చర్చ జరగాలని, దీనిపై చట్టం వచ్చేంతవరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.








