23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ నన్నెందుకు తిడుతున్నారు?: ఖమ్మం సభలో కేసీఆర్, మోడీని ఏకేసిన బాబు

నన్నెందుకు తిడుతున్నారు?: ఖమ్మం సభలో కేసీఆర్, మోడీని ఏకేసిన బాబు

chandrababu-in-khammam-election-meeting
- Advertisement -

chandrababu-speaking-in-khammam-election-meeting

ఖమ్మం: తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది తానేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూటమి నేతలతోపాటు చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్, సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాను హైదరాబాద్‌ను కట్టానని ఎప్పుడూ అనలేదని, తన హయాంలోనే సైబరాబాద్ రూపకల్పన జరిగిందని చెప్పారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, విమానాశ్రయాలు నిర్మించామని చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పార్టీకి మరోసారి అధికారం ఇవ్వవద్దని తెలంగాణ ప్రజలందర్నీ కోరారు.

తానెప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదని అన్నారు. కేసీఆర్ తనను తిడుతున్నారని.. ఎందుకో అర్థం కాలేదని.. తమ్ముళ్లూ మీకైనా తెలుసునా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తనను దూషించడం న్యాయమా? ఏం తప్పు చేశానని తిడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ?

అసలు టీడీపీ లేకపోతే కేసీఆర్ ఉంటాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ రాజకీయ జన్మనిస్తే.. తననే విమర్శిస్తారా? అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. తాను విమర్శించనని, తెలంగాణ, దేశం కోసం పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు. తన పోరాటం వల్లే ఎన్నికల్లో వీవీప్యాట్ వచ్చిందని చెప్పారు.

ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలని.. ప్రజాకూటమికి 100కి 1000శాతం గెలిపించాలని కోరారు. ప్రజాకూటమిదే విజయమని అన్నారు. భయపడితే శాశ్వతంగా నష్టపోతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరం బంగారు గుడ్డు పెట్టే నగరమని, అలాంటి నగరం పెట్టుకుని కూడా తెలంగాణను అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

తెలంగాణ నెం.1గా ఉండాలనేదే తన కోరిక అని అన్నారు. కానీ, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలైందన్నారు.
బీజేపీకి ఓట్లు లేవు కానీ.. హెలికాప్టర్లున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేగాక, ఈ సభలో టీఆర్ఎస్, బీజేపీ మనుషులెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.

ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్.. చారిత్రక అవసరం

ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్ రావడం చారిత్రక అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశం, ప్రజాస్వామ్యం కోసం కలిశామని చెప్పారు. వచ్చే నెల 10న ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు టీడీపీ-కాంగ్రెస్ సమావేశం జరుగుతోందని చంద్రబాబు చెప్పారు.

బీజేపీతోనే ఉంటారా? అని కేసీఆర్, ఎంఐఎం పార్టీలను చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్, ఎంఐఎంకు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లేనని చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ జనసేన, సీపీఐ, ఇతర పార్టీలన్నీ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

- Advertisement -