ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకూటమి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూటమి నేతలతోపాటు చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది తెలంగాణతోపాటు జాతీయస్థాయిలో ఓ నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని అన్నారు. అన్ని పార్టీలు ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడుతున్నాయని చెప్పారు.
కేంద్రం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. వ్యతిరేకిస్తే ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ విఫలమయ్యాయని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని అన్నారు.
దేశంలో ముస్లిం సోదరులు, దళితులు అభద్రతా భావంతో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకొచ్చి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్డీఏ, బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలవాలని పిలుపునిచ్చారు. ఇందుకు రాహుల్ గాంధీ సహకరిస్తున్నారని చెప్పారు.
ఖమ్మంలో ప్రజాకూటమికి 10కి పది సీట్లు…
ఖమ్మంలో 10కి పది సీట్లు గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. విభజన సమయంలో కూడా రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని తాము కోరామని చంద్రబాబు చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదని కేంద్రంపై మండిపడ్డారు. ఇవన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాంతం తనకు ప్రియమైనదని, తాను ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదని అన్నారు. తాను ఏపీ సీఎంని అని, తెలంగాణ హితం కోసం అండగా ఉంటానని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ తనపై విమర్శలు చేస్తున్నారని, కానీ తాను తెలుగుజాతి కోసం సహకరిస్తానని చెప్పారు.