భారతీయ సినీ చరిత్రలోనే.. ఒక అద్భుతం! ( రజినీకాంత్ ‘2.0 మూవీ రివ్యూ’)

rajini-kanth-amy-jackson
- Advertisement -

ఒకటి, రెెండు ఈ స్థానాలతో పాపాయిలే ఆడుకుంటారు.. ఇక్కడ ఒకే ఒక్కడు సూపర్ వన్..

ఇది 2.0 సినిమాలో రజినీ మార్క్  డైలాగ్..

2.0 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాను నిలబెట్టిన రజినీకాంత్ ఫాలోయింగ్‌కి.. నిజంగా అతికిన డైలాగ్ ఇది..

రజినీకాంత్, శంకర్, ఏఆర్ రెహమాన్, అక్షయకుమార్.. ఇలాంటి మహామహాులు అందరూ  కలిసి నాలుగేళ్లకు పైగా.. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన సినిమా..2.0.  ఈ సినిమాను థియేటర్లలో తిలకించి బయటికొస్తోన్న ప్రేక్షకులు.. ఇంకా 2.0 మైకంలోంచి బయటికి వచ్చినట్లు లేరు.  అందరినోటా ఒకటే మాట.. అద్భుతం..

ఇంతవరకు భారతీయ సినిమాల్లో ఈ తరహా సైన్స్ ఫిక్షన్ సినిమా  చూడలేదని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10,500 సినిమా థియేటర్లలో అత్యంత గ్రాండ్‌గా విడుదలైంది 2.0. ఇండియాలో 7,500 థియేటర్లలో సినిమా విడుదలైంది. ఓవర్సీస్ లో 3000 స్క్రీన్స్‌పై దుమ్మురేపుతోంది.

తొలిరోజు తమిళనాడులో రూ.35 కోట్లు, ఆంధ్రాలో రూ.20 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు, హిందీ రాష్ట్రాల్లో సుమారు రూ.40 కోట్లు, ఓవర్సీస్‌లో  రూ.50 కోట్లు..  ఇలా విడుదలైన తొలిరోజే  రూ.150 కోట్లకుపైగానే వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి తొలిరోజు రూ.120 కోట్లతో ఇప్పటివరకు ప్రథమస్థానంలో ఉండగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 2.0 దీన్ని మించిపోయి రికార్డులు స‌ృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

డౌట్ లేదు.. 2.0 ఓ విజువల్ వండర్…

అందరూ ఊహించినట్టుగానే 2.0 సినిమా ఓ విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంది. అలాగే సినిమా కథ కూడా అందరికీ సుపరిచితమైపోయింది. ఎందుకంటే నాలుగేళ్లుగా సినిమా తీస్తుండటంతో ఈ సినిమా కథ చాలామటుకు తెలిసిపోయింది. అయితే ఆ కథను దర్శకుడు శంకర్ ఎలా తీశాడన్నదే చూద్దామని వెళ్లి.. ఒక అద్భుతాన్ని చూసి వచ్చిన సంతోషంతో ప్రేక్షకులు చిందులు తొక్కుతున్నారు.

ఇక తమిళనాడులో అయితే సినిమా థియేటర్ల దగ్గర సంబరాలు, కోలాటాలు, హడావుడి మామూలుగా లేదు. ఒక సినిమా హీరోకి ఇంత నీరాజనమా.. ప్రభంజనమా అంటే ఆశ్చర్యం కలగకమానదు. అంతమందిని తనవైపునకు తిప్పుకున్న నటుడు ర.ినీకాంత్‌కు నిజంగా అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

అంతేకాదు, రజినీకి తగ్గ రేంజ్‌లో సినిమా తీసి.. తనేమిటోచూపించిన దర్శకుడు శంకర్‌కి కూడా హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాగే విలన్ గా నటించి ఎంతో కష్టమైనా ఆ మేకప్ వేసుకొని నటించిన అక్షయ్ కుమార్‌కు, ఇక ఎంత చెప్పినా తక్కువే అయినా చెప్పక తప్పని సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మన్ కు అందరం హ్యాట్సాఫ్ లు చెప్పాల్సిందే..

ఇదీ కథ…

సినిమా మొదట్లో ఒక ముసలి వ్యక్తి ఒక సెల్ ఫోన్ టవరెక్కి దూకి చనిపోతాడు. అతని చుట్టూ బోలెడన్ని పక్షులు తిరుగుతుంటాయి. అతనెవరనేది ఎవరికీ తెలీదు. కానీ సడన్ గా అందరి చేతుల్లోని  మొబైల్ ఫోన్లనీ గాల్లో ఎగిరెళ్లిపోతుంటాయి. ఇదేదో అంతర్జాతీయ కుట్రగా అందరూ భావిస్తుంటారు. మొత్తానికి దీనిపై ఒక సైంటిస్టులతో సెమినార్ జరుగుతుంది. దానికి వశీకరణ్ అదేనండీ మన రోబో సినిమాలో సైంటిస్టు రజనీకాంత్..అతనూ వెళతాడు. తను చెప్పిన ఒక ఐడియా వారికి నచ్చుతుంది. అయితే  మళ్లీ చిట్టిని తిరిగి తీసుకురావాలని అతను ప్రభుత్వానికి విన్నవిస్తాడు. దానికి వారు సరేనని అంగీకరిస్తారు.

అలా మొదటి సినిమాలో మ్యూజియంలో పెట్టిన చిట్టి దగ్గరకు వెళ్లి అతన్ని బతికిస్తారు. అదేనండి తిరిగి అతికిస్తారు. ఇప్పడు ఎగిరెళ్లిపోతున్న సెల్ ఫోన్ల కథలోకి వస్తే.. వీటన్నింటిని విలన్ అక్షయకుమార్ లాగేస్తుంటాడు. నిజానికి అతను విలన్ కాదు.. అతనొక సైంటిస్టు.. అతని పేరు రిచర్డ్స్.. అతను ఒక పక్షి ప్రేమికుడు.. మనం వాడే మొబైల్ ఫోన్లకి భయంకరమైన రేడియేషన్ ఉంటుందని మనందరికి తెలుసు.. కానీ మనం వాడుతుంటాం.

ఆ రేడియేషన్స్ మన మొబైల్ ఫోన్లకి చేరే  క్రమంలో మొదట పక్షులని తాకుతాయి. దీనివల్ల మొదట ఎఫెక్టు అయ్యేది.. ఆ పక్షులే.  ఇదే అక్షయకుమార్ కి నచ్చదు.. వాటిపై అతడు పరిశోధనలు చేస్తుంటాడు.  ఈ క్రమంలోనే అతను ఆ సెల్ టవర్ ఎక్కి దూకేస్తాడు. ఆ దూకే క్రమంలో ఆ పక్షుల నుంచి కొన్ని అద్భుతమైన శక్తులు అతనికి సంక్రమిస్తాయి. దీంతో అతను ముందు తమ పక్షి జాతిని నాశనం చేస్తున్న ఈ మొబైల్ ఫోన్లన్నీ లాగేస్తుంటాడు.

rajini-akshay-different-avatars-2అతని ఆశయం గొప్పదే.. కానీ చేసే విధానమే మంచిది కాదు.. అందుకే విలన్ అయిపోతాడన్నమాట..

చూడండి మన చేతిలో సెల్ ఫోను మన నుంచి ఎవరైనా లాగేసుకుంటే విలవిల్లాడిపోతాం.. అదే చిన్నపిల్లలు లాగేసుకుంటే వీపు మీద దబదబా బాదేస్తాం కదా.. ఎందుకంటే అది మనకు  ప్రాణంతో సమానం .. అలాంటిది మానవులకు అంత విలువైన మొబైల్ ఫోన్లను లాగేసుకునే సరికి..అందరికీ పీకల మీద కోపం వచ్చింది. మొత్తానికి మీటింగ్  పెడతారు. వశీకరణ్ వెళతాడు.. మళ్లీ చిట్టిని తీసుకువస్తాడు. అయితే చిట్టి పవర్ సరిపోదు. అతను ఓడిపోతాడు.

మళ్లీ ఏం  చేయాలని ఆలోచిస్తుంటే.. చిట్టికి చిప్ మార్చి విలన్‌గా చేసిన.. ఆ సైంటిస్టు కొడుకు ఒకడుంటాడు. అతను సుభాష్ పాండే.. అసలు చిట్టికి అన్ని పవర్స్ ఎక్కడ నుంచి వచ్చాయని వారు ఆరా తీస్తారు.. సైంటిస్టు వోరా 2.0 అనే చిప్ ను చిట్టిలో పెట్టడం వల్ల అతనికన్ని సూపర్ పవర్స్ వచ్చాయని గ్రహించి.. రజనీకాంత్, సుభాష్ పాండే ఇద్దరూ  కలిసి మళ్లీ చిట్టికి 2.0ను మరింత డెవలప్ చేసి.. మళ్లీ తను ప్రజలపై పడి వీరిని కొట్టేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని.. ప్రజల కోసం పోరాడేలా డిజైన్ చేసి రూపొందించి.. బర్డ్  మేన్ అక్షయకుమార్ మీదకి వదులుతారు. అప్పుడు చిట్టి..సూపర్  పవర్ తో ఒక పంజరాన్ని అల్లుతాడు. దాంట్లోకి బర్డ్ మ్యాన్ ని రప్పించి..అతన్ని ఈజీగా అతని కథను ముగిస్తాడు.అందుకే సినిమాకు  పవర్ ఫుల్ గా మార్చిన  ఆ చిప్ కి ఉన్న పేరునే.. 2.0 అని పెట్టారు.

ఇందులో గొప్ప సోషల్ మెసేజ్ ఉంది.

మనం వాడే మొబైల్ ఫోన్లు, వాటి వల్ల వచ్చే రేడియేషన్ల ప్రభావం..పక్షి జాతిపై ఎంత ప్రభావం చూపిస్తుందో శంకర్ ఎంతో గొప్పగా తీశాడు. ఇందులో పోస్టర్లలో ఒక మెసేజ్ ఉంది. నిజానికి శంకర్ అన్ని సినిమాలు సోషల్ మెసేజ్ పైనే ఆధారపడి ఉంటాయి. ఈ సినిమాకు ముందు వచ్చిన ఐ.. అదేనండి విక్రమ్ అద్భుతంగా నటించిన సినిమా.. అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది..నిజానికి ఆ కసితోనే ఈ సినిమా మొదలుపెట్టాడు గానీ.. బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువైపోవడం.. నాలుగేళ్లకు పైనే పట్టేయడం..అయినా విసుగు లేకుండా, కంగారు పడకుండా, ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీయడం అతని ఓపికకు, సినిమాపై ప్రేమకు  నిదర్శనం..

ఇంతకీ ఆ మెసేజ్ ఏమిటంటే.. ఈ భూమ్మీద మనుషులకే కాదు.. అన్నిప్రాణులకి జీవించే హక్కు, అధికారం ఉంది..

ఇది సింగిల్ లైన్ పాయింట్.. చాలాకాలం తర్వాత కుటుంబమంతా కలిసి వెళ్లి చూడదగిన సినిమా ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలుంటే తప్పకుండా తీసుకువెళ్లండి. పెద్దవాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు.. ఇప్పటివరకు భార్యలను బయటకు కనీసం సినిమాకు కూడా తీసుకెెళ్లలేని వారుంటే.. వారికి ఈ ప్రపంచం టెెక్నాలజీతో ఎంత ముందుకు వెెళ్లిపోతుందో చూపించండి. ఒక అద్భుతాన్ని చూసి రండి.. ప్రపంచానికి భారతయ చలనచిత్ర ఘనతను చాటి చెప్పిన చిత్ర బృందానికి అభినందనలు చెప్పండి.

తారాగణం…

నటీనటులు: రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటింగ్: ఆంథోనీ
వీఎఫ్ఎక్స్ అడ్వైజర్: శ్రీనివాసమోహన్
యాక్షన్: సెల్వ
నిర్మాత: ఏ.సుభాష్ కరణ్, రాజు మహాలింగం
దర్శకుడు: శంకర్

– శ్రీనివాస్ మిర్తిపాటి

చదవండి: పాత ఫార్ములాతో కొత్త సినిమా.. (‘టాక్సీ వాలా’ మూవీ రివ్యూ)

- Advertisement -