టీవీ9 ఇష్యూ: విచారణకు హాజరుకాలేనన్న నటుడు శివాజీ, పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా…

4:40 pm, Fri, 12 July 19
actor-shivaji

హైదరాబాద్: టీవీ9 వాటాల కొనుగోలుకు సంబంధించిన వివాదం కేసులో గురువారం విచారణకు తాను హాజరుకాలేనంటూ నటుడు శివాజీ సైబరాబాద్ పోలీసులకు తెలియజేశారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను ఆ రోజు విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ ఈ మేరకు ఆయన ఒక ఈ-మెయిల్‌ను సంబంధిత పోలీసుల అధికారులకు పంపించారు. 

చదవండి: హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఊరట!

టీవీ9లో వాటాల కొనుగోలు వివాదం కేసులో అలంద మీడియా ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాష్, నటుడు శివాజీలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు సైబర్ క్రమ్ పోలీసుల పలుమార్లు ప్రయత్నించగా నటుడు శివాజీ వారికి అందుబాటులో లేకుండా పోయారు.

11న విచారణ…

దీంతో పోలీసులు ఆయనపై లుక్‌ ఔట్ నోటీసులు కూడా జారీ చేయడం.. ఈ క్రమంలో ఇటీవల నటుడు శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకుని శివాజీని అదుపులోకి తీసుకున్న వారు ఈ కేసులో ఈనెల 11న విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు.

పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం.. గురువారం శివాజీ ఈ కేసు విచారణకు హాజరు కావలసి ఉండగా, ఆయన రాలేదు. ‘మా అబ్బాయిని అమెరికాలోని ఓ స్కూల్లో చేర్పించాల్సి ఉంది. నాపై లుక్‌ఔట్‌ నోటీసు ఉన్నందున హైకోర్టు అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నేను విచారణకు రాలేను..’ అని శివాజీ తాను పంపిన ఈ-మెయిల్‌లో తెలిపారు. 

చదవండి: ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు… మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్…