25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home కరోనా వైరస్ హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఒక్క మహిళ నుంచి 80 మందికి కరోనా..!

హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఒక్క మహిళ నుంచి 80 మందికి కరోనా..!

80-people-infected-with-covid19-from-a-single-woman-in-hyderabad
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఓ వృద్ధురాలి నుంచి ఏకంగా 80 మందికి కరోనా సోకడం, వారిలో వైద్యులు, నర్సులు కూడా ఉండడం కలకలం సృష్టిస్తోంది. 

ఆ వృద్ధురాలికి చికిత్స చేసిన పాతబస్తీ తలాబ్ కట్టలోని వైద్యుల నిర్లక్ష్యంతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పూర్తి వివరాలు వెల్లడించకపోవడం వల్లే ఈ స్థాయిలో కరోనా విరుచుకుపడినట్లుగా చెబుతున్నారు. 

అసలేం జరిగిందంటే…

తలాబ్ కట్ట ప్రాంతంలోని భవానీనగర్‌కు చెందిన ఓ వృ‌ద్ధురాలు అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉండే ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ తరువాత అక్కడ్నించి ఆమెను అదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 

చదవండి: షాకింగ్: హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా.. భయాందోళనలో వినియోగదారులు

ఆ వృద్ధురాలి శరీరంలో కరోనా వైరస్ ఉందేమో అన్న అనుమానం ఆమెకు చికిత్స చేసిన వైద్యులకుగాని, నర్సులకుగాని రాకపోవడంతో వారు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. 

ఆ తరువాత ఆ వృద్ధురాలు మరణించింది. ఆమెది సాధారణ మరణంగానే పరిగణించి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరై అంత్యక్రియలు కూడా నిర్వహించారు. 

అయితే ఆమె మృతదేహం నుంచి అధికారులు సేకరించిన నమూనాలను పరీక్షించగా రిపోర్టులలో ఆమె కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. 

మర్కజ్ వెళ్లొచ్చారు, అదీ అసలు కథ…

ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను తరచి తరచి అడగడంతో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆమె కుటుంబంలో ఒకరు ఇటీవల మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లుగా తేలింది. దీంతో ఆ వ్యక్తి ద్వారా వృద్ధురాలికి కరోనా సోకినట్లుగా తేల్చారు. 

ఆమెకు తొలుత చికిత్స చేసిన స్థానికంగా ఉన్న వైద్యుడుగానీ, ప్రైవేటు ఆసుపత్రిలో ఆ వృద్ధురాలికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు అందరినీ ఇబ్బందుల్లో పడేసింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు రోగి నేపథ్యం గురించి ఏ ఒక్కరూ వాకబు చేయకపోవడంతో ఆమె ద్వారా ఎంతో మందికి కరోనా వైరస్ సోకింది. 

చదవండి: కరోనా అప్‌డేట్: గంట గంటకూ పెరుగుతున్న కేసులు.. 24 గంటల్లో 1,334.. మొత్తం కేసులు…

మరణించిన తరువాత వచ్చిన నివేదికలో ఆ వృద్ధురాలు కరోనా పాజిటివ్ అని తేలడంతో అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అంతేకాకుండా, వాళ్లతో కలిసి మెలిసి తిరిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. 

మరోవైపు వారి నుంచి తీసుకున్న శాంపిల్స్‌ను పరీక్షించగా.. వారిలో 22 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంకా మరికొందరి శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావలసి ఉంది. 

ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులకు…

మరోవైపు ఆ వృద్ధురాలికి చికిత్స చేసిన ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరి ద్వారా వైరస్ సోకిన వారిని, అలాగే ఆ వృద్ధురాలి బంధువులను కలుపుకొంటే.. మొత్తం 80 మందికిపైగా ప్రమాదంలో పడ్డారు. 

అసలే తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే, ఆమెకు చికిత్స చేసే సమయంలోనే గుర్తించి.. తగిన జాగ్రత్తలు గనుక తీసుకొని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

చదవండి: లాక్‌డౌన్ ఆంక్షలు: సడలింపా? కొనసాగింపా? ప్రగతిభవన్‌లో టీఎస్ క్యాబినెట్ భేటీ ప్రారంభం…
- Advertisement -