అమెరికాలో తెలుగు టెక్కీ అనుమానాస్పద మృతి! అసలేం జరిగింది?

telangana-techie-died-in-america
- Advertisement -

హైదరాబాద్‌: అమెరికాలో ఓ తెలుగు టెక్కీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడి పేరు నాయకం కాశీ విశ్వనాథ్. తెలంగాణకు చెందిన విశ్వనాథ్‌(26) నార్త్‌కరోలినాలోని షార్లెట్‌లో తన గదిలో శవమై కనిపించాడు.

విశ్వనాథ్‌ తెలంగాణకు చెందినవాడు. ఈయన స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరిలోని నల్లపోచమ్మ వాడ. మూడున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన విశ్వనాథ్‌ షార్లెట్‌లోని ఇన్ఫోసిస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

గది తలుపులు తీయకపోవడంతో…

ఈనెల 3న ఉదయం 10 గంటల వరకు విశ్వనాథ్‌ తన గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు తలుపు పగలగొట్టి లొపలికి వెళ్లి చూశారు. అక్కడ విశ్వనాథ్‌ అపస్మారక స్థితిలో ఉండటంతో వారు వెంటనే పోలీసులకు సమచారమిచ్చారు.

దీంతో పోలీసులు విశ్వనాథ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విశ్వనాథ్‌ మరణించాడు. అతడి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో, అతడికి ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా? అని కాశీ విశ్వనాథ్‌ పెద్దనాన్న కుమారుడు ధన్‌శ్యాం నాథ్‌ను ఆసుపత్రి వైద్యులు వాకబు చేశారు.

అనంతరం అతడి మృతదేహం నుంచి తీసుకున్న శాంపిల్స్‌‌ను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు కాశీ విశ్వనాథ్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతడి మ‌ృతిపై తమకు అనుమానాలున్నాయని అతడి పెద్దనాన్న ఎన్‌.అశోక్‌ పేర్కొన్నారు. అతడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు.

- Advertisement -