అవాక్కయ్యారా? ఇదే మరి అసలు సిసలు రాజకీయం!

rahul-modi-hug
- Advertisement -

rahul-modi-hugఅమరావతి: కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ నోటీసు ఇచ్చింది.  స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అవకాశం ఇచ్చారు.  దీంతో బాల్ పార్లమెంట్‌లోకి వచ్చి పడింది.  ఇంకేముంది.. ఆట మొదలవగానే ఎవరిష్టం వచ్చినట్టు వారు ఆడుకున్నారు. ఈ ఆట కూడా ఈ మధ్యే ముగిసిన సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని తలదన్నేలా జరిగింది.

బాల్ వేసింది టీడీపీయే కానీ ఎవరి ఆట వారు ఆడేశారు. యువరాజు రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగియగానే.. సరాసరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు.  అంతటితో ఆగలేదు, మోడీని హగ్ కూడా చేసుకున్నారు.  దీంతో మోడీజీ ఒక క్షణం అవాక్కయ్యారు.

అది షేక్ హ్యాండేనా?.. లేక…

ఈ హఠాత్ పరిణామంతో ప్రధాని మోడీ కూడా యువరాజు రాహుల్ గాంధీ ఇచ్చింది షేక్ హ్యాండా లేక షాక్ హ్యాండా అన్నది తేల్చుకోలేకపోయారు.. కానీ క్షణాల్లో తేరుకొని మళ్ళీ రాహుల్‌ని పిలిచి తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు.  పార్లమెంటు నిండు సభలో జరిగిన ఈ సన్నివేశాన్ని  చూశాక అవాక్కవడం యావత్ భారతావని వంతు అయింది.

అసలు ఇందులో ఉన్న మతలబు ఏమిటన్న దానిపై హాట్ హాట్ చర్చలూ మొదలవుతున్నాయి. రాజకీయ మేధావులు ఏమని విశ్లేషిస్తారో వేచి చూడాల్సిందే. అయితే అది హగ్గా.. లేక కరెంటు ప్లగ్గా అని పలువురు నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు.  రాహుల్ గాంధీ, మోడీల అంతరంగం తెలియక సతమతమవుతున్నారు. అది కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగమా.. అని కూడా చర్చించుకుంటున్నారు.

కన్నుగీటిన రాహుల్!

ప్రధాని మోడీకి హగ్ ఇచ్చి ఆనక తాపీగా నడుచుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చున్న యువరాజు రాహుల్‌గాంధీ పక్కన ఉన్న వారిని చూస్తూ కన్నుగీటడం కూడా చర్చనీయాంశమైంది. రాహుల్ కన్నుగీటడం వెనుక కారణాలు కొందరు వెదుకుతున్నారు. ‘ఊరకే ఏమీ చేయరు మహానుభావులు..’ అని కొందరు నసుగుతున్నారు.

పదవిలో ఉన్న నాయకులు ఏ పని చేయాలన్నా కాస్త ఆలోంచించాల్సిందే.  ఎందుకంటే.. ఒకప్పుడు కేవలం పత్రికా విలేకరుల కళ్లు మాత్రమే వీరిపై ఉండేవి. వారు కూడా పరిమిత సంఖ్యలో ఉండేవారు.  వారు ఏం రాస్తే అది లక్షల మంది పాఠకులు చదివేవారు.  కానీ ఇప్పటి పరిస్థితి వేరు.  ఇప్పుడు అందరూ రిపోర్టర్లే.  సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో కోట్లమంది నెటిజన్ల మధ్య షేర్ అయిపోతోంది. కాబట్టి ఒక్క రాజకీయ నాయకులే కాదు, సెలబ్రిటీలు కూడా ఎవరికి వారు తమ జాగ్రత్తల్లో ఉండాల్సిందే.

పార్లమెంటులో కాంగ్రెస్ యువరాజు ప్రవర్తనపై ఒకవైపు ఇన్ని చర్చలు జరుగుతుండగా.. మరోవైపు రాహుల్ గాంధీకి సభ హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇంతకీ ప్రత్యేక హోదా సంగతి ఏమైనట్లు?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానం రకరకాల మలుపులు తిరిగింది. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని తెలియజేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా  ఆంధ్ర ప్రదేశ్ సమస్యను దేశం మొత్తానికి తెలిసేలా చేయగలిగాం అని పేర్కొన్నారు. తెలంగాణాలో కూడా నీటిచుక్క లేదు.. ప్రాజెక్టులు మేమే కట్టుకుంటున్నాం .. ఆంధ్రప్రదేశ్‌కి సాయం చేసినట్టే మాకు చేయాలి అని తెలంగాణకు చెందిన ఓ ఎంపీ పేర్కొన్నారు

ఇలా తెలుగుదేశం పార్టీ  ప్రవేశ పెట్టిన అవిశ్వాసం అనే బాల్‌ను ఎవరికి వారు ఎలాబడితే అలా ఆడేశారు.  ఎవరి వాదనలు వారివి, ఎవరి రాష్ట్ర సమస్యలు వారు చెప్పుకున్నారు, కొందరు ఇదే మంచి అవకాశం అని బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు.  అయితే ఎవరు ఎలా ఆడినా గోల్ కీపర్ మోడీజీ మాత్రం అవిశ్వాసం బాల్‌ని సమర్థవంతంగా ఎదుర్కొని ఎప్పటిలాగే.. తనదైన శైలిలోఎక్కడికో గ్రౌండ్ అవతలకి కొట్టేశారు.  రాత్రి 12 గంటలకు సభ ముగిసింది.. విశ్వాసం వీగిపోయింది. ఇంతకీ ప్రత్యేక హోదా సంగతి ఏమైనట్లు?

- Advertisement -