గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్! పైకే ఇలా.. లోపల మరోలా, విభజన నాటినుండి కొనసాగుతున్న అంతరం!

7:16 pm, Thu, 10 January 19
governor-narasimhan-cm-chandrababu-1

chandrababu-narasimhan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ నరసింహన్‌కు మధ్య సయోధ్య లేదా? రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన అంతరం ఇంకా కొనసాగుతూనే ఉందా? అంటే అవుననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ సమయంలో సైతం గవర్నర్ నరసింహన్‌కు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పరస్పరం విరుద్ధంగా మాట్లాడడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. తెలంగాణ, సీమాంధ్రగా విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతూనే ఉన్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్‌ నరసింహన్‌ల నడుమ సఖ్యత కనిపిస్తుండగా.. అటు ఏపీలో మాత్రం ఇది కొరవడినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు సీఎం చంద్రబాబు, అటు గవర్నర్ నరసింహన్ తమ దారులు వేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విభజన అనంతరం గవర్నర్ నరసింహన్ తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వంపై కేంద్రానికి గవర్నర్ తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ.

అయితే గవర్నర్ నరసింహన్ మాత్రం ఎప్పుడూ, ఎక్కడా ఏ ఆరోపణపైనా స్పందించలేదు, నోరు విప్పలేదు. ఆయన తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఆయా ఘటనలు, విషయాలపై తన అభిప్రాయాలను నేరుగా ఢిల్లీకి నివేదిస్తున్నారు.

జగన్‌పై దాడి సమయంలో…

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన సందర్భంలో గవర్నర్ నరసింహన్ నేరుగా ఏపీ డీజీపీకి ఫోన్ చేసి ఆరా తీయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఒకింత సీరియస్ అయ్యారు.

గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మరికొన్ని సందర్భాలలో గవర్నర్ తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ అధికార పక్షం నేతలు ఆరోపణలు గుప్పించారు. అయినప్పటికీ కూడా గవర్నర్ నరసింహన్ ఈ ఆరోపణలను పట్టించుకోలేదు, స్పందించలేదు.

తాజాగా ఏయూ స్నాతకోత్సవంలోనూ…

బుధవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఒకే వేదికను పంచుకున్న గవర్నర్ నరసింహన్, మంత్రి గంటా శ్రీనివాసరావులు ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో పరస్పరం విభేదించుకోవడం ఆస్తక్తికరంగా మారింది.

మంత్రి గంటా మాట్లాడుతూ ప్రభుత్వ యూనివర్సిటీలు.. ప్రైవేటు యూనివర్సిటీలతో పోటీ పడాలని అనగా.. అది సాధ్యం కాని విషయమని గవర్నర్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.

అంతటితో ఊరుకోకుండా.. వైద్య రంగంలో ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో.. ప్ర‌భుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని.. విద్యా రంగంలో ఇలాంటి దయనీయ పరిస్థితి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించడం కూడా చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలుగా రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలు, ఆయా సందర్భాలలో గవర్నర్ తీరు.. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా ఇతర టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం గమనిస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని అంటున్నారు.

మరోవైపు తన తీరుపై ఎవరేమన్నా పట్టించుకోకుండా గవర్నర్ నరసింహన్ తన పని తాను చేసుకుంటూ వెళుతుండడం, తాజాగా ఏయూ స్నాతకోత్సవం ఘటన.. అన్నీ చూస్తుంటే ఇంకా గవర్నమెంట్‌కు, గవర్నర్‌కు సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.