
ఢిల్లీ: బీజేపీతో సఖ్యంగా మెలుగుతున్న వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఏపీ సీఎం జగన్ ఖండించారు. నిన్న ఢిల్లీ పర్యటనకి వెళ్లిన ఆయన బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదాపై అమిత్ షాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై స్పందిస్తూ… ఆ పదవి ఇస్తామని తమకు ఎవరూ చెప్పలేదని, అలాగే తామూ అడగలేదని చెప్పారు.
అయితే అలాంటి ప్రతిపాదనేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. దేవుడి దయతో ప్రత్యేక హోదా వచ్చే వరకు… తాను వచ్చినప్పుడల్లా మరిచిపోకుండా ప్రతీ సందర్భంలోనూ అడుగుతూనే ఉంటానని అన్నారు.
ఇక ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పేరొన్న హామీల అమలు హోం శాఖ పరిధిలో ఉంటుందని, అందుకే హోం మంత్రిని కలిశానని, ప్రత్యేక హోదా ఆవశక్యతను వివరించానని, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశానని జగన్ వివరించారు.








